Thopudurthi Prakash Reddy: రాప్తాడు లో జగన్( Jagan Mohan Reddy) పర్యటన నేపథ్యంలో జరిగిన పరిణామాల వెనుక మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందని పోలీసులు ధృవీకరించారు. ఉద్దేశపూర్వకంగానే కార్యకర్తలను రెచ్చగొట్టి ఉద్రిక్తత కారణమయ్యారన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లో జగన్మోహన్ రెడ్డి పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దూసుకొచ్చారు. ఈ క్రమంలో శాంతిభద్రతలు అదుపు తప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. జగన్ భద్రత విషయంలో పోలీసుల వైఫల్యం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది.
Also Read: పోసానిపై మరో కేసు.. వదిలేదే లేదా? అసలేం జరిగింది?
* కానిస్టేబుల్ ఫిర్యాదు.
అయితే తాజాగా ఈ తొక్కిసలాటలో గాయపడిన ఓ పోలీస్ కానిస్టేబుల్( police constable) ఫిర్యాదు మేరకు రామగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. అయితే ఈ తొక్కిసలాటకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కారణమని తేల్చారు పోలీసులు. ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి అరెస్టు తప్పదని ప్రచారం నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పర్యటనలు తొక్కిసలాట, హెలిపాడ్ వద్ద ఉద్రిక్తతకు కారణం తోపుదుర్తి అని.. ఆయన ఉద్దేశపూర్వకంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టారని పోలీసులు నిర్ధారిస్తున్నారు.
* ఆ రెండు పరిణామాలతో..
రాప్తాడు నియోజకవర్గం లో లింగమయ్య( lingamayya ) అనే వైసీపీ బీసీ నేత హత్యకు గురయ్యారు. ఆయనను రాజకీయ ప్రత్యర్థులే హతమార్చారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. టిడిపి నేతలే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అన్ని విధాలా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. స్వయంగా వచ్చి పరామర్శిస్తానని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే మండల పరిషత్ ఎన్నికల్లో పోలీసుల వ్యవహార శైలిని జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టారు. అయితే ఈ సందర్భంగా రాప్తాడు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చొచ్చుకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే ఇది పోలీస్ భద్రత వైఫల్యం అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పోలీసులపై వ్యతిరేకత వచ్చేలా ప్రచారం చేసింది. దీనిని సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. తెర వెనుక జరిగిన పరిణామాలను గుర్తించారు.
* పోలీస్ శాఖ సూచనలు పెడచెవిన..
అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీస్ శాఖ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి( topudurti Prakash Reddy ) కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హెలిపాడ్ వద్ద బారికేట్లు ఏర్పాటు చేయాలని సూచించినట్లు సమాచారం. అటువంటి ఏర్పాట్లు చేయకుండా.. జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే తోపుదుర్తి తో డి.ఎస్.పి వాదనకు దిగారు. తమ సూచనలు ఎందుకు పట్టించుకోలేదని డీఎస్పీ ప్రశ్నించారు. అయితే జగన్ పర్యటనలో ఒక్కసారిగా దూసుకొచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఇబ్బంది పడ్డారు పోలీసులు. ఒకరిద్దరు గాయపడ్డారు కూడా. మరోవైపు రాళ్ల దాడికి సైతం సిద్ధపడినట్లు ప్రచారం సాగింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ కు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కారణమని పోలీసులు భావించారు. ఆయనపై తాజాగా కేసు నమోదు చేశారు. ఆయన అరెస్టు తప్పదని ప్రచారం సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.