YCP party : ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది.కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగింది వైసిపి. కానీ దారుణ పరాజయం చవిచూసింది. ఇక పార్టీకి భవిష్యత్తు లేదనుకుంటున్న నేతలు గుడ్ బై చెబుతున్నారు. పదుల సంఖ్యలో ఇప్పటివరకు పార్టీని వీడారు. అయితే ఫస్ట్ టైం ఓ మహిళ నేత బయటకు వెళ్లిన తర్వాత మాత్రం జగన్ పై విమర్శలు ఎక్కు పెడుతున్నారు. ఇప్పటివరకు చాలామంది నాయకులు పార్టీకి దూరమయ్యారు. వివిధ కారణాలతో ఇతర పార్టీల్లో చేరారు. కానీ జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన వారు చాలా తక్కువ. మాజీ మంత్రులు ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను వంటి వారు పార్టీలో ఒక వెలుగు వెలిగారు. కానీ ఇప్పుడు తమ దారి తాము చూసుకున్నారు. అయితే వేరే పార్టీలోకి వెళ్లే క్రమంలో జగన్ పై అయితే భారీ స్థాయిలో విమర్శలకు దిగలేదు. కానీవైసిపి హయాంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ గా వ్యవహరించిన వాసిరెడ్డి పద్మ మాత్రం.. జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనకు బాధ్యత లేదని.. పాలనపై పట్టు లేదని.. ఏం చెప్పినా వినరని ఇలా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అయితే వాసిరెడ్డి పద్మ మంచి వాగ్దాటి కలిగిన నాయకురాలు. ఆపై సమకాలిన అంశాలపై అవగాహన ఉంది. ఆమె కామెంట్స్ తప్పకుండా ప్రజల్లోకి వెళ్తాయి. ఆమె వెనుక ఉండి ఎవరో నడిపిస్తున్నారు అన్నది అనుమానం. అయితే అది ఇప్పుడు అప్రస్తుతం. వాసిరెడ్డి పద్మ ద్వారా వైసీపీతో పాటు జగన్ కు భారీ డ్యామేజ్ జరగడం ఖాయం. అయితే వాసిరెడ్డి పద్మ విమర్శలపై వైసీపీ నుంచి ఎదురుదాడి జరగడం లేదు. దానికి మూల్యం తప్పదని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
* రెండు రోజులు అవుతున్నా
రెండు రోజుల కిందట వాసిరెడ్డి పద్మ పార్టీకి గుడ్ బై చెప్పారు.పార్టీ అధినేత తీరును ఎండగట్టారు.సహజంగా ఓ మహిళ నేత విమర్శలు చేస్తే.. తోటి మహిళా నేతలతో విమర్శలకు తిప్పి కొట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే రోజులు గడుస్తున్న వాసిరెడ్డి పద్మ విమర్శలపై వైసీపీ నేతలు ఎవరు స్పందించలేదు. అయితే ఆమెను భయపడుతున్నారా? ఆమె చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
* ఆ మహిళా నేతలు ఏమయ్యారు?
వైసీపీలో మహిళా నేతలకు కొదువ లేదు. మాజీ మంత్రులు ఆర్కే రోజా, మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఉషశ్రీ చరణ్ లాంటి మహిళా నేతలు ఉన్నారు. తాజాగా అధికార ప్రతినిధిగా మారిన యాంకర్ శ్యామల సైతం అందుబాటులోనే ఉన్నారు. కానీ వారెవరు మాట్లాడిన దాఖలాలు లేవు. వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాత్రం మీడియా ముందుకు వచ్చారు. పొడిపొడిగా మాట్లాడి వెళ్లిపోయారు. దీంతో ఒక మహిళా నేతను ఎదుర్కొనే సత్తా వైసీపీకి లేదా? అని సెటైర్లు పడుతున్నాయి.