YCP Leader Kakani Govardhan Reddy Arrest: ఏపీలో ( Andhra Pradesh) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టు పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించి కీలక నేతలు.. వైసీపీ ప్రభుత్వంలో పని చేసిన అధికారులు అరెస్టయ్యారు. గత 100 రోజులుగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న గోవర్ధన్ రెడ్డిని కేరళలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా తో పాటుగా నిబంధనలు ఉల్లంఘించి పేలుడు పదార్థాలు వినియోగించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదయింది. ఫిబ్రవరిలో కేసు నమోదు కాగా ఆయన అరెస్టు ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. కేరళలో ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం ఆయనను నెల్లూరు తీసుకొచ్చే అవకాశం ఉంది.
* మూడు నెలల కిందట కేసులు
నెల్లూరు( Nellore ) జిల్లాలో అక్రమ మైనింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరిలో కేసు నమోదయింది. అటు తరువాత కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు ప్రయత్నం చేశారు. కానీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. అప్పటినుంచి కాకాణి అరెస్టు ఉంటుందని అంతా భావించారు. ఈ క్రమంలోనే ఆదివారం కేరళలో గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్రమ మైనింగ్ కేసులు గోవర్ధన్ రెడ్డి ఏ ఫోర్ నిందితుడిగా ఉన్నారు. విచారణకు హాజరుకావాలని పోలీసులు పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు.
Also Read: Seaplane in AP : ఇక నీటిపై తేలుతూ ప్రయాణం.. ఏపీలో ఆ మూడు రూట్లలో సీ ప్లేన్!
* నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్..
వైఎస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) ప్రభుత్వ హయాంలో విస్తరణలో భాగంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలోనే 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగా రవాణా చేశారని అప్పట్లో వివాదం రేగింది. లీజు కాలం ముగిసిన తర్వాత కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆక్రమించుకొని.. మైనింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. రాళ్లను పేల్చేందుకు నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను నిల్వ చేసి ఉపయోగించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో ఫిబ్రవరి 16న కాకాని గోవర్ధన్ రెడ్డి తో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఇలా నమోదు చేసిన కేసుల్లో గోవర్ధన్ రెడ్డిని a4 నిందితుడిగా చేర్చారు. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఆయన స్పందించకపోవడంతో ఇప్పుడు అరెస్టు చేశారు.
Also Read: AP Rains : నాలుగు రోజుల పాటు వానలే వానలు.. గోవా తరువాత ఏపీలోకి!
* దూకుడు కలిగిన నేత..
వైసిపి హయాంలో కాకాని గోవర్ధన్ రెడ్డి( Govardhan Reddy) దూకుడుగా ఉండేవారు. జగన్ తన తొలి మంత్రివర్గంలో నెల్లూరు జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ కు ఛాన్స్ ఇచ్చారు. విస్తరణలో మాత్రం గోవర్ధన్ రెడ్డికి పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారు. జిల్లాలో గోవర్ధన్ రెడ్డి వ్యతిరేకులు అధికంగా ఉండేవారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చాలామంది నేతలు కూటమి పార్టీల్లో చేరారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో పూర్తిగా సీన్ మారింది. అక్రమ మైనింగ్ కేసు వెంటాడింది. దీంతో కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకు వెళ్లక తప్పలేదు.