Vishaka Dairy : ఏపీ లడ్డు వివాదం నేపథ్యంలో.. రాష్ట్రంలో అన్ని ఆలయాలు అలెర్ట్ అయ్యాయి. ప్రసాదం తయారీపై ఫుల్ ఫోకస్ పెట్టాయి.ముఖ్యంగా నెయ్యి వినియోగించి తయారు చేసే ప్రసాదం పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.అందులో భాగంగా సింహాచలం వరాహ నరసింహ స్వామి ఆలయంలో లడ్డు ప్రసాదం తయారీపై.. ఆలయ వర్గాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాయి. ఇప్పటివరకు వినియోగిస్తున్న నెయ్యి కాకుండా.. విశాఖ డెయిరీ నెయ్యిని వాడాలని నిర్ణయించడం విశేషం. అయితే విశాఖ డైరీ చైర్మన్ గా వైసీపీ నేత అడారి ఆనంద్ కుమార్ ఉన్నారు. అటువంటి డైరీ తో సింహాచలం దేవస్థానం ఒప్పందం చేసుకోవడం విశేషం. దీని వెనుక రకరకాల ప్రచారం నడుస్తోంది. నిత్యం సింహాచలం దేవస్థానానికి వేలాదిమంది భక్తులు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిస్సా, ఛత్తీస్గడ్ ల నుంచి భారీగా భక్తులు వస్తుంటారు. మొక్కుబడులు చెల్లించుకుంటారు. స్వామి వారి తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు. అయితే ఇక్కడ లడ్డు తయారీకి వైసీపీ నేతకు చెందిన డైరీ నెయ్యిని వినియోగించుకోవడానికి డిసైడ్ కావడం విశేషం.
* సహకార సంస్థగా గుర్తింపు
విశాఖ డైరీ సహకార సంస్థ. దీనికి సుదీర్ఘకాలం చైర్మన్ గా అడారి తులసి రావు ఉండేవారు. ఆయన బతికున్నంత కాలం టిడిపిలో కొనసాగారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయినా సరే ఎన్నడూ టిడిపిని వీడలేదు. కానీ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక.. విశాఖ డైరీ పై ఒత్తిడి పెరిగింది. చైర్మన్ గా ఉన్న ఆనంద్ కుమార్ వైసీపీలో చేరాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.
*తులసిరావు వారసుడిగా
అడారి తులసిరావు మృతి చెందిన తర్వాత.. విశాఖ డైరీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు ఆనంద్ కుమార్. 2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు టిడిపి తరఫున. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆనంద్ కుమార్ పై ఒత్తిడి ప్రారంభమైంది. దీంతో ఆయన వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఓడిపోవడంతో సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
* త్వరలో టిడిపిలోకి
ఉత్తరాంధ్రలో విశాఖ డైరీ కి మంచి బ్రాండ్ ఉంది. అడారి తులసిరావు అదే బ్రాండ్ ను కొనసాగిస్తూ వచ్చారు. దానిని కొనసాగిస్తున్నారు ఆనంద్ కుమార్. గతంలో సింహాచలం దేవస్థానానికి విశాఖ డైరీ నెయ్యి సరఫరా జరిగేది. కానీ తరువాత ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు టీటీడీ లడ్డు వివాదం నేపథ్యంలో.. తిరిగి విశాఖ డైరీ నెయ్యి సరఫరాను పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. అయితే అడారి ఆనంద్ కుమార్ టిడిపిలో చేరికకు రంగం సిద్ధమైందని.. అందులో భాగంగానే ఆయన డైరీ కి చెందిన నెయ్యికి అనుమతి ఇచ్చారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.