Actor Prakashraj : నిండా మునిగిన వాడికి చలి ఉండదంటారు. ఇప్పుడు ఇది వైసీపీకి అతికినట్టు సరిపోతుంది. తిరుపతి లడ్డు వివాదంలో వైసిపికి ఎంత డ్యామేజ్ జరగాలో..అంతలా జరిగిపోయింది. వైసీపీ సర్కార్ తప్పిదం అంటూ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. దీనిపై వైసీపీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా పదవులు చేపట్టిన వై వి సుబ్బారెడ్డి,కరుణాకర్ రెడ్డితో ప్రత్యేక ప్రకటనలు ఇప్పించింది.జగన్ సైతం స్వయంగా రంగంలోకి దిగారు. ఈ ఘటనను ఖండించారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు. మరోవైపు సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది వైసిపి. ఇంకోవైపు తిరుపతిలో ప్రమాణం చేశారు కరుణాకర్ రెడ్డి. తన హయాంలో అసలు తప్పులు జరగలేదంటూ చెప్పుకొచ్చారు.అయినా సరే వైసీపీపైఅందరి అనుమానాలు ఉన్నాయి.ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరడంతో పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. పవన్ నోటి నుంచి వస్తున్న మాటలను ఏ వైసీపీ నేత కూడా అడ్డుకోలేకపోతున్నారు.
* పవన్ పై కౌంటర్ కు
అయితే తాజాగా వైసీపీ నేతలకు నటుడు ప్రకాష్ రాజ్ ఆశా కిరణం గా కనిపిస్తున్నారు.సనాతన ధర్మ పరిరక్షణకు జాతీయస్థాయిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు దీనిని ఆహ్వానించారు. కానీ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం భిన్నంగా స్పందించారు. దేశంలో ఇప్పుడున్న మత వివాదాలు చాలావా?అని ప్రశ్నించారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరే కనుక..యాక్షన్ లోకి దిగాలని కోరారు.దేశంలో మీ స్నేహితులే అధికారంలో ఉన్నారు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీనిపై హిందువులు ఫైర్ అవుతున్నారు. జనసైనికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేపాల్ లో సినిమా షూటింగ్లో ఉన్న ప్రకాష్ రాజ్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం తాను సినిమా షూటింగ్లో ఉన్నానని.. నా మాటలను పూర్తిస్థాయిగా గమనించాలని.. నేరుగా వచ్చి మాట్లాడతానని పవన్ కు విజ్ఞప్తి చేశారు.
* వైసీపీ నేతలు ఎంటర్
తాజాగా ఈ వివాదంలో ఎంటర్ అయ్యింది వైసిపి. అసలు ప్రకాష్ రాజ్ చేసిన తప్పేంటని.. ఆయన మాటల్లో ఏం తప్పు ఉందని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయినప్పుడు వైసీపీ నేతలు సంబరపడ్డారు.తమకు ఒక వాయిస్ దొరికిందని భావించారు. ఇప్పటికే చాలామంది వైసిపి నేతలు ప్రకాష్ రాజ్ కు అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ తో వివాదాస్పద వ్యాఖ్యలు చేయించి.. తమపై వచ్చిన నిందను తొలగించుకోవాలని వైసిపి భావిస్తోంది. అయితే ఏది చేసినా త్వరగా చేయాలని.. తరువాత ప్రకాష్ రాజ్ వచ్చిన ఏం ప్రయోజనం ఉండదని వైసీపీకి చెందిన వ్యూహకర్తలు అభిప్రాయపడుతున్నారు.
* ఆ వీడియో అందుకేనా
అయితే పవన్ కళ్యాణ్ విషయంలో ప్రకాష్ రాజ్ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. అందుకే సోషల్ మీడియాలో ఆ వీడియోను విడుదల చేశారని..తాను నేరుగా వచ్చి మాట్లాడతానని చెప్పుకొచ్చినట్లు సమాచారం. మెగా కుటుంబంతో ప్రకాష్ రాజ్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. చిరంజీవిని అన్నయ్య అని సంబోధిస్తారు ప్రకాష్ రాజ్. మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ మా ఎన్నికల్లో మెగా కుటుంబం ప్రకాష్ రాజ్ ను అధ్యక్ష పదవికి ఎంపిక చేసింది. కానీ ఆ ఎన్నికల్లో మంచు విష్ణు చేతిలో ఓడిపోయారు ప్రకాష్ రాజ్. అయినా సరే అప్పటినుంచి ప్రత్యేక అనుబంధంతో మెలుగుతున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుని.. బిజెపిపై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే తన వ్యాఖ్యలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసేసరికి ప్రకాష్ రాజ్ వెనక్కి తగ్గారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ప్రకాష్ రాజ్ ను రెచ్చగొట్టే పనిలో పడినట్లు తెలుస్తోంది.