Vinukonda Case: కూటమి అధికారంలోకి వచ్చి నెలరోజులు అవుతోంది.అప్పుడే ప్రభుత్వ లోపాలపై మాట్లాడడం సరికాదు.రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే మరో ఆరు నెలలు అవసరం.కొత్త పాలకులు సెట్ కావాలన్నా సమయం కీలకం.కానీ అప్పుడే మొదలుపెట్టింది వైసిపి.కానీ ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు.గతం కంటే ప్రజల్లో ఒక రకమైన అవగాహన పెరిగింది.అందుకే ఒక రెండేళ్ల వరకు కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వగలరు.జగన్ మాత్రం ఉండలేకపోతున్నారు. కానీ ఆయనకు ఆప్షన్ లేదు. చంద్రబాబును గద్దె దించేందుకు ఆయన ప్రయత్నాలు చేయడం కామన్. కానీ అవి ఇప్పట్లో వర్క్ కావు కూడా. మరో ఐదేళ్ల పాటు నిరీక్షించక తప్పదు జగన్ కు. ఐదేళ్లలో కూటమి పాలన చూస్తారు ప్రజలు. గత వైసిపి పాలనకు,చంద్రబాబు పాలనకు బేరీజు వేసుకుంటారు.అప్పుడే ఒక నిర్ణయానికి వస్తారు.
అయితే గతంలోలా జగన్ కు పరిస్థితులు కలిసి వస్తాయని చెప్పడం చాలా కష్టం. జగన్ ఈ స్థాయికి రావడానికి కారణం అప్పట్లో జరిగిన ప్రత్యేక పరిణామాలు. ఆ పరిస్థితులు కూడా అనుకూలించాయి. వైయస్ మరణం, కాంగ్రెస్ లో వారి కుటుంబానికి అవమానం, సింపతి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, అప్పటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీకి అవకాశం ఉండడం.. ఇవన్నీ జగన్ కు కలిసి వచ్చాయి. వైసీపీ ఎదగడానికి దోహదపడ్డాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సంక్షేమం తప్ప గడిచిన ఐదేళ్లలో జగన్ చేసిన అభివృద్ధి కూడా లేదు.అందుకే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆయన ఏం చేయలేరు కూడా. అవకాశాల కోసం కాచుకొని కూర్చోవడమే తప్ప జగన్ చేసింది ఏమీ లేదు.
వైసీపీకి ఘోర పరాజయం ఎదురయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. పైగా వైసీపీ ఓడిపోగానే ఏపీకి స్వతంత్రం వచ్చినట్లు ప్రజలు ఫీలైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూటమి సర్కార్లో చిన్న చిన్న లోపాలను జగన్ ఎత్తి చూపిన ప్రజలు పెద్దగా పట్టించుకోరు. పైగా అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి చంద్రబాబుతో పాటు మంత్రులు అభివృద్ధికి పరితపిస్తున్నారు. అమరావతి రాజధానితో పాటు పోలవరం నిర్మాణానికి చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. అప్పుల సమస్య వేధిస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు. నెలరోజుల చంద్రబాబు పాలన బ్యాలెన్స్ గా వెళ్ళింది. శాంతిభద్రతల్లో ప్రభుత్వం విఫలమైనట్లు వైసిపి ఆరోపించినా ప్రజలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.
జగన్ పై ఒక అపవాదు ఉంది. సింపతిని క్యాష్ చేసుకుంటారన్న విమర్శ ఉంది. తన రాజకీయ ప్రస్థానాన్ని సానుభూతి అంశంతో ప్రారంభించారు జగన్. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషిచేసిన తన తండ్రి రాజశేఖరరెడ్డి మరణాన్ని వాడుకున్నారు. ఆయన వారసత్వంగా సీఎం పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తన తండ్రి మరణంతో చనిపోయిన వారిని పరామర్శించి ప్రజల్లో ఒక రకమైన సానుభూతిని సృష్టించగలిగారు. గత ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి ప్రజల్లో మమేకమయ్యే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విశాఖ ఎయిర్పోర్ట్లో కోడి కత్తి దాడి జరిగింది. దాని నుంచి కూడా విపరీతమైన సానుభూతి పొందారు. కానీ గత ఐదేళ్ల కాలంలో ఆ కేసును ఎంతలా నీరుగార్చాలో.. అంతలా చేశారు. సరిగ్గా 2019 ఎన్నికల కు ముందు బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసును సానుభూతికి మలుచుకున్నారు. గత ఐదేళ్లలో ఆ కేసు ఎలా నీరుగారిపోయిందో సగటు ఏపీ పౌరుడికి తెలుసు.ఈ ఎన్నికలకు ముందు ప్రచారంలో గులకరాయతో దాడి జరిగింది.అది సానుభూతి కోసం చేసిన ఘటనగా ప్రజలు అభిప్రాయపడ్డారు.పెద్దగా విశ్వసించలేదు.
ఇప్పుడు విపక్షంలో ఉంది వైసీపీ.ప్రజల్లోకి వచ్చి పోరాడాలంటే ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వడం అవసరం.కానీ వినుకొండలో వైసీపీ నేతను దారుణంగా హత్య చేశారని ఆరోపిస్తూ.. దానిని రాజకీయ అంశంగా మార్చాలని వైసీపీ భావిస్తోంది. ఆ హత్య రాజకీయ కోణంలో జరిగింది కాదని.. వ్యక్తిగత కక్షల వల్ల చోటు చేసుకుందని జిల్లా ఎస్పీ స్వయంగా ప్రకటించారు. అయినా కూడా వైసిపి నేతలు వినడం లేదు. మృతుడి కుటుంబాన్ని ఈరోజు జగన్ పరామర్శిస్తారు. సహజంగానే రాజకీయ విమర్శలు చేస్తారు. కానీ ప్రజలు పట్టించుకునే స్థితిలో మాత్రం ఉండరన్న విషయాన్ని గ్రహించుకోవాలి.