https://oktelugu.com/

Union Budget 2024: మరో ఐదు రోజుల్లో కేంద్ర బడ్జెట్.. చంద్రబాబు అడిగినవన్నీ ఇస్తారా? లేదా?

సాధారణంగా కేంద్రంలో టిడిపి కీలకంగా ఉన్నా.. బ్లాక్ మైలింగ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు చంద్రబాబు. మోడీ ప్రభుత్వంతో సఖ్యతతో మెలుగుతూ వ్యూహాత్మకంగా రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబెట్టుకోవాలని చూస్తున్నారు. బడ్జెట్లో ఏపీకి ఎక్కువగా కేటాయింపులు ఉండేలా ఆయన మంత్రాంగం నడుపుతున్నట్లు తెలుస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : July 19, 2024 / 09:36 AM IST

    Union Budget 2024

    Follow us on

    Union Budget 2024: కేంద్ర బడ్జెట్ పైనే ఏపీ ఆశలు పెట్టుకుంది. మరో ఐదు రోజుల్లో కేంద్ర బడ్జెట్ రాబోతోంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు.ముఖ్యంగా ఏపీకి కీలక కేటాయింపులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేశారు.కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి బడ్జెట్ ఇది.గతం కంటే భిన్నంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు భాగస్వామ్య పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

    ఈ ఎన్నికల్లో బిజెపికి సొంతంగా మెజారిటీ రాలేదు.బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరించింది.244 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది.మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా ఉండిపోయింది.ఈ తరుణంలో ఏపీలో టిడిపి,బీహార్లో జేడీయు సాధించిన సీట్లు కీలకంగా మారాయి.వాటి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపించాల్సిన దుస్థితి నెలకొంది.అందుకే గతం మాదిరిగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటామంటే కుదిరే పని కాదు.ఈ రెండు రాష్ట్రాలకు బడ్జెట్లో పెద్దపీట వేయక తప్పని పరిస్థితి.ఇదే ఆదునుగా ప్రత్యేక హోదాను డిమాండ్ చేయాలని,విభజన హామీలు అమలు చేయాలని టిడిపి మీద ఒత్తిడి పెరుగుతోంది.కానీ గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు.ఆచరణ సాధ్యం కానీ హోదా లాంటి అంశాల జోలికి పోవడం లేదు.

    సాధారణంగా కేంద్రంలో టిడిపి కీలకంగా ఉన్నా.. బ్లాక్ మైలింగ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు చంద్రబాబు. మోడీ ప్రభుత్వంతో సఖ్యతతో మెలుగుతూ వ్యూహాత్మకంగా రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబెట్టుకోవాలని చూస్తున్నారు. బడ్జెట్లో ఏపీకి ఎక్కువగా కేటాయింపులు ఉండేలా ఆయన మంత్రాంగం నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు కేంద్ర పెద్దల వద్ద ఏపీకి సంబంధించిన కీలక అంశాలను బయటపెట్టారు. వాటికోసం నిధులు భారీగా అడిగారు.ఇదే విషయంపై ఢిల్లీ వర్గాల్లో ఒక రకమైన ప్రచారం జరుగుతోంది.ప్రధానంగా అమరావతిని మళ్లీ ఏపీ రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు అక్కడ అభివృద్ధిని పరుగులు పెట్టించాలని చూస్తున్నారు.ఆ ప్రాంత రూపురేఖలను మార్చాలని భావిస్తున్నారు.ఇందుకోసం ఆయన 50 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని కోరినట్లు సమాచారం.ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరాన్ని తిరిగి పట్టాలెక్కించడం కోసం 12 వేల కోట్ల రూపాయలు చంద్రబాబు అడిగినట్లు తెలుస్తోంది.

    గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఏపీ పూర్తిగా విధ్వంసానికి గురైంది.అప్పుల భారం పెరిగిపోయింది.పరిమితి దాటిన అప్పుల క్లియరెన్స్ కి 12 వేల కోట్ల రూపాయలు కావాలని చంద్రబాబు అభ్యర్థించినట్లు తెలుస్తోంది.అలాగే ఇన్ఫ్రా ప్రాజెక్టులకు పదివేల కోట్లు,ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టులకు 60 వేల కోట్లు అడిగినట్లు సమాచారం.అయితే చంద్రబాబు అడిగినవన్నీ కాకుండా.. కొన్నింటినైనా ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మరో ఐదు రోజుల్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

    ఇంకోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారు. కనీసం ప్రత్యేక ప్యాకేజీ అయిన ఇవ్వాలని కోరుతున్నారు. ఈ తరుణంలో చంద్రబాబుపై సైతం ఒత్తిడి పెరుగుతోంది. కానీ చంద్రబాబు హైరానా పడడం లేదు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని చూస్తున్నారు. పాలన సజావుగా ముందుకు తీసుకెళ్లేందుకు చొరవ చూపుతున్నారు.అంతకుమించి అతి చేసే అవకాశం లేదు. ముఖ్యంగా కేంద్రంతో ఎటువంటి వివాదం పెట్టుకునే పరిస్థితి ఉండదని తెలుస్తోంది.