Vijayanagaram : రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా రాజకీయ వేధింపులు కనిపిస్తున్నాయి. చివరకు దేవస్థానాల్లో పూజలు చేసే అర్చకులను సైతం విడిచిపెట్టడం లేదు. పూజల్లో కూడా తమవారికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలిస్తున్నారు. విపక్ష నేతలు వస్తే పూజలు చేసినా, వారిని ప్రత్యేకంగా కలిసినా వేటు తప్పదని హెచ్చరిస్తున్నారు. విజయనగరం జిల్లా రామతీర్థం దేవస్థానంలో ఏకంగా ఐదుగురి అర్చకులకు ఇదే విధంగా నోటీసులు జారీచేశారు. వారు చేసిన తప్పేంటంటే ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజును కలవడమే.

వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత విజయనగరం రాజు అశోక్ గజపతిరాజుపై ఫోకస్ పెంచింది. ఆయన్ను ఎన్నిరకాల ఇబ్బందులు పెట్టాలో అన్నిరకాలుగా పెట్టింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ స్థానం నుంచి తొలగించింది. సింహాచలం, రామతీర్థం దేవస్థానం ట్రస్ట్ బోర్డు నుంచి సైతం వేటువేసింది. సూపర్ కమిటీలను నియమించింది. బైలాకు వ్యతిరేకంగా ఆనందగజపతిరాజు కుమార్తె సంచయితను తెరపైకి తెచ్చింది. అయితే చివరకు న్యాయస్థానం ద్వారా అశోక్ గజపతిరాజు ఊరట పొందారు. తిరిగి నియామకాలన్నీ పొందారు. కానీ యంత్రాంగం ద్వారా వైసీపీ సర్కారు అడుగడుగునా అడ్డుకుంటోంది. అవమానం చేస్తోంది.
ఇటీవల రామతీర్థం దేవస్థానాన్ని ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు సందర్శించారు. భవిష్యత్ కు గ్యారెంటీ పేరిట టీడీపీ బస్సు యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా టీడీపీ నాయకులు రామతీర్థం దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఇద్దరు అర్చకులు అశోక్ గజపతిరాజును కలిశారు. యాత్రకు సంబంధించి బస్సుకు పూజలు చేశారు. కానీ ఇది నిబంధనలకు విరుద్ధమంటూ దేవాదాయ శాఖ అధికారులు ఐదుగురు అర్చకులకు నోటీసులు జారీచేశారు. దీనికి సరైన సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే చివరకు ఆలయాల్లో పూజలు చేసే అర్చకులను సైతం వైసీపీ సర్కారు విడిచిపెట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అన్నవరంలో అర్చకులను వేలం వేయడంపై తీవ్ర దుమారం రేగుతోంది. పవన్ కళ్యాణ్ ఇదే విషయంపై గట్టిగా పోరాడుతున్నారు. ఇటువంటి సమయంలో మిమ్మల్ని విధుల నుంచి ఎందుకు తొలగించకూడదంటూ అర్చకుల మెడపై కత్తి పెట్టడంపై బ్రాహ్మణ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి చర్యలు మానుకోకుంటే జగన్ సర్కారుకు మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు.