AP Elections 2024: ఇదెక్కడి చోద్యం.. టిడిపికి వైసీపీ అభ్యర్థి ఓటు!

నెల్లూరు పార్లమెంట్ స్థానం నుండి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు. ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ నుంచి టిడిపిలో చేరారు. వైసీపీకి మూల స్తంభంగా ఉండేవారు. నమ్మకమైన నేతగా పనిచేసేవారు.

Written By: Dharma, Updated On : May 17, 2024 12:03 pm

AP Elections 2024

Follow us on

AP Elections 2024: ఏపీలో పొలిటికల్ హీట్ తగ్గడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ నాడు హింస చెలరేగింది. రెండు రోజుల తర్వాత కూడా కొనసాగుతూ వస్తోంది. కేంద్ర బలగాలు ఏపీని చుట్టుముట్టాయి. అదే సమయంలో గెలుపు పై ఇరుపక్షాలు ధీమాతో ఉన్నాయి. ఎవరికి తోచింది వారు విశ్లేషిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. వైసీపీ అభ్యర్థి ఒకరు సైకిల్ గుర్తుపై ఓటు వేశారన్నది ఆ వార్త సారాంశం. ఇప్పటికే రకరకాల ఆందోళనతో ఉన్న వైసీపీకి ఇది ఇబ్బందికరమైన పరిణామమే. కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తనకు ఇబ్బందులు లేకుండా చేసుకోవడానికి.. సదరు వైసీపీ అభ్యర్థి టిడిపికి ఓటు వేశారని ప్రచారం జరుగుతోంది. ఇది వైసీపీ శ్రేణులకు తీవ్ర నైరాశ్యంలో ముంచుతోంది.

నెల్లూరు పార్లమెంట్ స్థానం నుండి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు. ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ నుంచి టిడిపిలో చేరారు. వైసీపీకి మూల స్తంభంగా ఉండేవారు. నమ్మకమైన నేతగా పనిచేసేవారు. కానీ వైసీపీ సీనియర్ల నుంచి వేమిరెడ్డికి అవమానాలు ఎదురయ్యాయి. జగన్ సైతం వేమిరెడ్డిని పట్టించుకోకపోవడంతో ఆయన మనస్థాపంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. టిడిపి ఎంపీ అభ్యర్థి అయ్యారు. వైసిపి హై కమాండ్ వేమిరెడ్డిని పట్టించుకోకపోయినా.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రం వేమిరెడ్డి అంటే అభిమానిస్తూనే ఉన్నారు. ఆ అభిమానంతోనే నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ అభ్యర్థి ఒకరు వేమిరెడ్డికి ఓటు వేశారన్నది తాజాగా వైరల్ అవుతున్న వార్త.

కావలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చుట్టే ఈ ఆరోపణలు తిరుగుతున్నాయి. ప్రతాప్ కుమార్ రెడ్డి ముసునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. వైసిపి అభ్యర్థిగా ఉన్న తనకు తాను ఓటు వేసుకున్నారు. ఎంపీ విషయానికి వచ్చేసరికి మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటు వేసే సమయంలో ఆయన వెంట సిబ్బంది ఉన్నారు. ఈ క్రమంలో ఆయన సైకిల్ కి ఓటు వేయడం వాళ్ళు చూసినట్లు తెలుస్తోంది. అలానే ఈ విషయం బయటకు చెప్పొద్దు అని పోలింగ్ సిబ్బందిని కూడా ఆయన అనుచరులు బెదిరించినట్లు సమాచారం.

అయితే దీనిపై పెద్ద ఎత్తున దుమారం జరగడంతో ప్రతాప్ కుమార్ రెడ్డి స్పందించారు. తాను పొరపాటున టిడిపికి ఓటు వేసినట్లు తెలిపారు. అయితే ఆయన కావాలనే టిడిపికి ఓటు వేశారని ప్రచారం జరుగుతోంది. వైసిపి ప్రభుత్వ హయాంలో నాలుగు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అన్నది ప్రతాప్ కుమార్ రెడ్డి పై ఉన్న ఆరోపణ. ఒకవేళ టిడిపి అధికారంలోకి వస్తే తనపై చర్యలు ఉంటాయన్న ఉద్దేశంతోనే.. ఇ లా టీడీపీ ఎంపీ అభ్యర్థికి ఓటు వేశారని టాక్ నడుస్తోంది. ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఓడిపోతుందని.. ప్రతాప్ కుమార్ రెడ్డి కచ్చితంగా జైలుకు వెళ్తారు అన్న చర్చ స్థానికంగా జరుగుతోంది. అందుకే టిడిపికి ఓటు వేసి.. లీకులు ఇచ్చారని తెలుస్తోంది. మరి దీనిపై వైసీపీ నాయకత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.