YCP vs TDP : ఏపీలో ఏ చిన్న ఘటన జరిగినా రాజకీయ రంగు పులుముకుంటోంది. చిన్నపాటి వివాదాలు సైతం చినికి చినికి గాలి వానలా మారుతున్నాయి.ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వ్యవస్థలను దారుణంగా వాడుకుంటున్నారని.. దాడులకు తెగబడుతున్నారని టిడిపి ఫై ఆరోపణలు చేస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతోంది. ఫ్యాక్ట్ చెక్ పేరిట వాస్తవం ఇది అంటూ చెప్పే ప్రయత్నం చేస్తోంది. దీంతో అధికార, విపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.రాష్ట్రంలో విధి నిర్వహణలో ఉన్న ఓ ఎస్ ఐ పై టిడిపి నేతలు చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ సాక్షి మీడియాలో ప్రత్యేక కథనం వచ్చింది. అయితే అదంతా ఫేక్ అని.. ఫోటోలు మార్చి దుష్ప్రచారం చేస్తున్నారని టిడిపి తిరిగి ఆరోపించింది. దీంతో ఈ ఘటన సోషల్ మీడియాలో ఒక వైరల్ అంశంగా మారిపోయింది. దీనిపై సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ స్పందించారు. లోకేష్ అయితే ఇది నిజం అంటూ ఓ వీడియోను జత చేస్తూ పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు సైతం స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. రాష్ట్రంలో ఫేక్ ప్రచారం అధికమవుతోందని.. ఫేక్ పార్టీలను నమ్మొద్దని.. వారి ట్రాప్ లో పడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో టిడిపి శ్రేణులు ముందుగానే ఈ ఘటనపై స్పందించడం విశేషం.
* ఆ ఘటన ఇది
రేపల్లె, వేమూరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారంటూ వైసీపీ నేత వరికుటి అశోక్ బాబు ఆరోపించారు. టిడిపి నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో టిడిపి నేతలు సైతం బహిరంగ సవాళ్లకు దిగారు. పోలీసులు కలుగ చేసుకున్నారు. వరికూటి అశోక్ బాబును హౌస్ అరెస్టు చేశారు. టిడిపి నేతలు నిరసన వ్యక్తం చేస్తూ భట్టిప్రోలు టిడిపి కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరారు. అశోక్ బాబు ఇంటి వైపు వెళ్లేందుకు దూసుకెళ్లారు. దీనిని పోలీసులు నిలువరించారు. ఈ ప్రయత్నంలో టిడిపి కార్యకర్త ఒకరు పోలీసులపై దౌర్జన్యానికి దిగారు అన్నది వైసీపీ చేస్తున్న ఆరోపణ. దీనిపై స్ట్రాంగ్ గా టిడిపి సైతం రియాక్ట్ కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
*:సాక్షిలో ప్రత్యేక కథనం
సాక్షిలో ఈ ఘటనపై ఆదివారం ప్రత్యేక కథనం వచ్చింది. ఎస్సై పై ఓ టిడిపి నాయకుడు దాడి చేయడానికి ఫోటోలతో సహా ప్రచురించారు. అందులో ఎస్సై చొక్కా పట్టుకోవడాన్ని హైలెట్ చేశారు. అయితే దీనిపై టిడిపి మరోలా చెబుతోంది. సంబంధిత ఎస్సై సెల్ ఫోన్ పడిపోవడంతో.. దానిని తిరిగి ఇచ్చే క్రమంలో టిడిపి నేత ఎస్సై చొక్కాను తాకారన్నది తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్న సారాంశం. అయితే రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతుండడంతో మంత్రి నారా లోకేష్ స్పందించారు. అది ఫేక్ వీడియో అని తేల్చారు. ఒరిజినల్ వీడియో ఇది అంటూ సెల్ఫోన్ అందిస్తున్న దృశ్యాలను జతచేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.
* సోషల్ మీడియాలో రచ్చ
అయితే పరస్పర పోస్టులతో సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. అయితే ఆ వీడియోలు బయటపెట్టింది టిడిపి నేతలేనని.. గొప్పగా వాటిని సోషల్ మీడియాలో పెట్టారని.. అడ్డంగా బుక్కయ్యారని.. అడ్డగోలుగా దొరకడంతోనే చంద్రబాబుతో పాటు లోకేష్ స్పందించారని సాక్షి మరో కథనం ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఫ్యాక్ట్ చెక్ పేరిట ఫేక్ అని తేల్చగా.. సాక్షి మీడియా మాత్రం పేకాట అంశాన్ని పక్కదోవ పట్టించేందుకేనని ఆరోపిస్తూ కథనాలు రాస్తోంది. దీంతో ఇది ఓ వివాదాస్పద అంశంగా మారిపోయింది.
ఫేక్ న్యూస్ నమ్మొద్దు….ఫేక్ గాళ్లను నమ్మొద్దు….ఫేక్ రాజకీయాల ట్రాప్ లో పడి మోసపోవద్దు!#FekuJagan #AndhraPradesh pic.twitter.com/7Zi2JgO1gc
— N Chandrababu Naidu (@ncbn) August 4, 2024