Ashish Nehra : రోహిత్, విరాట్ ఆడాల్సిన అవసరం లేదు.. గౌతమ్ గంభీర్ ప్లాన్ అది.. సీనియర్ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..

రెండవ వన్డేలో భారత్ ఓడిపోయిన నేపథ్యంలో టీమ్ ఇండియా మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్ర కీలక వ్యాఖ్యలు చేశాడు. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి.." కోచ్ గా గౌతమ్ గంభీర్ తన కొత్త ప్రయాణాన్ని టీమిండియాతో మొదలుపెట్టాడు. తన మార్క్ చూపించడం ప్రారంభించాడు. దీని ఫలితాలు శ్రీలంక జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో కనిపించాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : August 6, 2024 2:58 pm
Follow us on

Ashish Nehra : టీమిండియా ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. మూడు మ్యాచ్ల టి20 సిరీస్ వైట్ వాష్ చేసింది. కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ కు, కోచ్ గా గౌతమ్ గంభీర్ కు మధుర జ్ఞాపకం గా నిలిచింది. దీంతో మూడు మ్యాచ్లు వన్డే సిరీస్ కూడా భారత్ గెలుస్తుందని అందరూ అంచనా వేశారు. శ్రీలంక దారుణమైన ఓటములను మూటగట్టుకోవాల్సి ఉంటుందని విశ్లేషించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శ్రీలంక అద్భుతంగా ఆడుతోంది. భయంకరమైన భారత బ్యాటింగ్ లైనప్ ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. తొలి మ్యాచ్ గెలవలసి ఉండగా.. భారత్ చేజేతులా టై చేసుకుంది. రెండో మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ వైఫల్యం వల్ల భారత్ ఓడిపోయింది. దీంతో అందరి దృష్టి ఇప్పుడు మూడవ మ్యాచ్ పై పడింది. మూడో మ్యాచ్లో భారత్ గెలిస్తే సిరీస్ 1-1 తో రెండు జట్లు సంయుక్త విజేతలుగా నిలుస్తాయి. భారత జట్టు గత 27 ఏళ్లుగా శ్రీలంకలో వన్డే సిరీస్ గెలవలేదు. దీంతో ఈసారి ఎలాగైనా సిరీస్ దక్కించుకోవాలని భావించింది.. కానీ ఆ ఆశలు నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.. రెండవ వన్డేలో శ్రీలంక బౌలర్ వాండర్సే ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి భారత జట్టు పతనాన్ని శాసించాడు.

రెండవ వన్డేలో భారత్ ఓడిపోయిన నేపథ్యంలో టీమ్ ఇండియా మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్ర కీలక వ్యాఖ్యలు చేశాడు. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి..” కోచ్ గా గౌతమ్ గంభీర్ తన కొత్త ప్రయాణాన్ని టీమిండియాతో మొదలుపెట్టాడు. తన మార్క్ చూపించడం ప్రారంభించాడు. దీని ఫలితాలు శ్రీలంక జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో కనిపించాయి. కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం మంచి పరిణామం.. గౌతమ్ గంభీర్ విదేశీ కోచ్ కాదు కదా.. అతడికి టీమిండియా పై ఎంత స్థాయిలో ఎఫర్ట్ పెట్టాలో.. తెలుసు. ఇదే సమయంలో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ శ్రీలంక టోర్నీలో ఆడాల్సిన అవసరం లేదు. టీ -20 ఫార్మాట్ కు వారిద్దరూ వీడ్కోలు పలికారు. అలా కొత్త ఆటగాళ్లకు అవకాశాలు లభించాయి. అలాంటి చర్యల వల్ల జట్టులోకి కొత్త రక్తం వస్తుంది. అది మంచి ఫలితాలను ఇస్తుంది.. విరాట్, రోహిత్ గురించి గౌతమ్ గంభీర్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది. వారిద్దరినీ అతడు ఎప్పటినుంచో చూస్తున్నాడు. అలాంటప్పుడు కొత్తగా నేర్పించడానికి కూడా ఏమీ లేదు. కాకపోతే విరాట్, రోహిత్ స్వదేశంలో ఆడే టోర్నీలలో పాల్గొంటే బాగుంటుందని” నెహ్ర తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు..

గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్ గా రాకముందు ఐపీఎల్ లో కోల్ కతా జట్టుకు మెంటార్ గా వ్యవహరించాడు. 2024 సీజన్ కప్ గెలిచేలా జట్టును నిలిపాడు. అది నచ్చి బీసీసీఐ గౌతమ్ గంభీర్ తో సంప్రదింపులు జరిపింది. రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టు ముగియడంతో.. అతడి స్థానంలో గౌతమ్ గంభీర్ ను నియమించింది.. ఈ నియామకంలో భాగంగా అతడికి 12 కోట్లను వార్షిక వేతనంగా చెల్లిస్తోంది. మిగతా భత్యాలు అదనంగా లభిస్తాయి. వాస్తవానికి రాహుల్ ద్రావిడ్ ను కోచ్ గా కొనసాగాలని రోహిత్ శర్మ కోరినప్పటికీ.. అందుకు అతడు ఒప్పుకోలేదు. దీంతో గౌతమ్ గంభీర్ ఎంట్రీ అనివార్యమైంది. అంతకుముందు గౌతమ్ గంభీర్ కు విరాట్ కోహ్లీ కి గొడవ జరిగింది. కొద్దిరోజుల పాటు వారిద్దరూ మాట్లాడుకోలేదు. ఇటీవలి ఐపిఎల్ లో వారిద్దరూ కలిసిపోయారు. ఇక ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న టోర్నీలోనూ గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటున్నారు. గౌతమ్ గంభీర్ సూచనలను విరాట్ పాటిస్తున్నట్టు బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోల ద్వారా తెలుస్తోంది. మరోవైపు శ్రీలంకలో జరిగిన తొలి వన్డే టై అయింది. రెండవ వన్డేలో భారత్ ఓడిపోయింది.. ఇక మూడో వన్డేలో భారత్ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచ్లో గెలిస్తే సిరీస్ 1-1 తో సమం అవుతుంది. శ్రీలంకతో జరుగుతున్న టోర్నీ కంటే ముందు భారత్ జింబాబ్వేలో పర్యటించింది.. టి20 సిరీస్ 4-1 తేడాతో గెలుచుకుంది. అంతకుముందు టి20 వరల్డ్ కప్ సాధించింది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పై ఏడు పరుగుల తేడాతో గెలుపును దక్కించుకొని.. 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు చెక్ పెట్టింది.