Amaravathi Capital: అమరావతి రాజధాని( Amaravathi capital ) పునర్నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో.. 24 గంటల పాటు పనులు కొనసాగుతుండడం విశేషం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ఊపిరి పీల్చుకుంది. గత అనుభవాల దృష్ట్యా రాజధాని నిర్మాణ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేశారు సీఎం చంద్రబాబు. ఏకంగా కేంద్ర ప్రభుత్వం 15000 కోట్ల రూపాయలను సాయంగా తన బడ్జెట్లో ప్రకటించింది. దానిని ప్రపంచ బ్యాంకుతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుల నుంచి రుణాల రూపంలో ఇచ్చింది. అయితే దానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వమే వహిస్తుంది. కానీ అమరావతి రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు విడుదలవుతూ వస్తాయి. తొలి విడతలో పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసింది ప్రపంచ బ్యాంక్. పనులు సంతృప్తికరంగా జరుగుతుండడంతో ఇప్పుడు డిసెంబర్లో మరో రెండు వేల కోట్ల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
* అప్పట్లో భారీగా ఫిర్యాదులు..
2014లో అందరి అభిప్రాయంతో అమరావతిని రాజధానిగా ప్రకటించారు చంద్రబాబు( CM Chandrababu). అప్పటి విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సైతం అమరావతిని ఆహ్వానించారు. మరింత భూమి సమీకరించాలని కూడా సలహా ఇచ్చారు. అయితే అప్పట్లో విభజనతో ఇబ్బంది పడుతున్న ఏపీకి కేంద్రం నుంచి ఇప్పటి మాదిరిగా సహకారం మాత్రం అందలేదు. ఈ తరుణంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సాయాన్ని తలుపు తట్టింది. ప్రపంచ బ్యాంక్ సైతం 3000 కోట్ల రూపాయలు రుణ సహాయానికి ముందుకు వచ్చింది. కానీ అప్పట్లో అమరావతిపై పెద్ద ఎత్తున ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు వెళ్లాయి. అసలు అది రాజధాని నిర్మాణానికి పనికి వచ్చే ప్రాంతం కాదని.. రుణం ఇవ్వొద్దని ఆ ఫిర్యాదుల సారాంశం. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సైతం ఆశించిన స్థాయిలో సహకారం ఇవ్వకపోవడం, షూరిటీ కి ముందుకు రాకపోవడంతో ప్రపంచ బ్యాంక్ ఆ మూడు వేల కోట్లు విడుదల చేయలేదు.
* మారిన కేంద్ర వైఖరి..
అయితే ఇప్పుడు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party) కీలక భాగస్వామి. మునుపటి మాదిరిగా ఎన్డీఏలో బిజెపికి సొంత మెజారిటీ లేదు. పైగా ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వంలో బిజెపి కీలక భాగస్వామి. ఇలా పరస్పర రాజకీయ అవసరాల దృష్ట్యా అమరావతి రాజధాని నిర్మాణానికి ఎనలేని ప్రాధాన్యమిస్తోంది కేంద్రం. ఏకంగా బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు తోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులను సర్దుబాటు చేసింది. అయితే అవి నిధులు కాదని.. రుణాలు అని విపక్షం గగ్గోలు పెట్టింది. అయితే దీనిపై కేంద్రం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. అది సాయం మాత్రమేనని.. ఆ రుణం బాధ్యత కేంద్రానిదేనిని స్పష్టతనిచ్చింది. అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చిక్ పడింది. అయితే అమరావతి రాజధాని నిర్మాణ పనులు చూసి నిధులు మంజూరు చేస్తున్న ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
* ఎప్పటికప్పుడు పనులు పరిశీలన..
అమరావతి రాజధాని నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు. తమకు చెప్పిన మాదిరిగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయా? లేదా? అని ఆరా తీస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు అమరావతికి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిధులు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చాలా సంస్థలు నిధులు సమకూర్చాయి. పనుల పనితీరును చూసి నిధులు విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా ఐకానిక్ భవనాల నిర్మాణం మరో ఏడాదిన్నరలో పూర్తికానుంది. అవి పూర్తయితే అమరావతికి ఒక రూపం వస్తుంది. 2028 ద్వితీయార్థానికి అమరావతి రాజధాని రెడీ కావడం ఖాయం.