AP Elections 2024: సార్వత్రిక ఎన్నికల సమరం తెలుగు రాష్ట్రాల్లో ముగిసింది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగగా, ఏపీలో 25 లోక్‌సభ స్థానాలతోపాటు, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏపీలో ఈసారి భారీగా పోలింగ్ జరగడంతో అధికార వైసీపీ, విపక్ష కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ దీమా ఇదీ..
ఏపీలో పెరిగిన పోలింగ్ తమకు కలిసి వస్తుందని టీడీపీ కూటమి భావిస్తోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారని అంచనా వేస్తోంది. ఇదే సమయంలో జనసేనతో పొత్తు తమకు బాగా కలిసి వస్తుందని, ఓట్ల శాతం బాగా పెరుగుతుందని భావిస్తున్నారు.
మేనిఫెస్టో కూడా..
ఇక టీడీపీ మేనిఫెస్టో కూడా ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపిందని టీడీపీ భావిస్తోంది. 2019 ఎన్నికల్లో తాము ప్రకటించిన పథకాలను మించి వైసీపీ అమ్మ ఒడి ప్రకటించడంతో ఓటర్లు నాడు వైసీపీవైపు మొగ్గు చూపినట్లు టీడీపీ అంచనా వేసింది. దీంతో ఈసారి వైసీపీ మేనిఫెస్టోకు దీటుగా తాము మేనిఫెస్టో ఇచ్చామని భావిస్తోంది. వైసీపీకి మించిన పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఓటర్లు కూటమివైపు మొగ్గు చూపారని అంచనా వేస్తోంది. రైతులకు కూలీలు దొరకకపోవడం కూడా గ్రామీణ ఓటర్లు కూటమి వైపు టర్న్ అయ్యారని భావిస్తోంది.
120 నుంచి 140 సీట్లు..
ఇక టీడీపీ ఈ ఎన్నికల్లో తమకు ఒంటరిగా 120 స్థానాల్లో గెలుస్తామని భావిస్తోంది. కూటమిగా 140 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు. మొత్తంగా ఈసారి ఏపీలో అధికారం మారబోతోందని, కూటమి అధికారంలోకి రాబోతోందని టీడీపీ నాయకులు గట్టిగా చెబుతున్నారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో జూన్ 4న చూడాలి.