Chabahar Port Agreement: ఇండియాకు అమెరికా వార్నింగ్‌.. ఆ ఒప్పందంతో ఉలిక్కిపడిన అగ్రరాజ్యం!

చాబహార్‌ పోర్టు నిర్వహణకు సబంధించి భారత్, ఇరాన్‌ మధ్య తాజాగా కీలక ఒప్పందం కుదిరింది. ఈ డీల్‌ అగ్రరాజ్యం అమెరికాకు మింగుడు పడడం లేదు. దీంతో భారత్‌ను పరోక్షంగా హెచ్చరించింది. టెహ్రాన్‌తో లావాదేవీలు జరిపే దేశాలపై ఆంక్షలకు వెనుకాడబోమని ప్రకటించింది.

Written By: Raj Shekar, Updated On : May 14, 2024 2:17 pm

Chabahar Port Agreement

Follow us on

Chabahar Port Agreement: అగ్రరాజ్యం అమెరికా ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. తన అవసరాల కోసం శత్రువులను దగ్గరకు తీసుకుంటుంది. అవరసం తీరాక మిత్ర దేశాన్ని కూడా దూరం చేసుకుంటుంది. ఇన్నాళ్లూ భారత్‌ తమకు మంచి మిత్రదేశం అని చెప్పిన అమెరికా.. ఇప్పుడు ఏకంగా వార్నింగ్‌ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇరాన్‌తో భారత్‌ చేసుకున్న ఓ ఒప్పందం ఆ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీంతో మిత్రదేశమని కూడా చూడకుండా వార్నింగ్‌ ఇవ్వడం అమెరికా ద్వంద్వ వైఖరికి నిదర్శనం.

ఏం జరిగిందంటే..
చాబహార్‌ పోర్టు నిర్వహణకు సబంధించి భారత్, ఇరాన్‌ మధ్య తాజాగా కీలక ఒప్పందం కుదిరింది. ఈ డీల్‌ అగ్రరాజ్యం అమెరికాకు మింగుడు పడడం లేదు. దీంతో భారత్‌ను పరోక్షంగా హెచ్చరించింది. టెహ్రాన్‌తో లావాదేవీలు జరిపే దేశాలపై ఆంక్షలకు వెనుకాడబోమని ప్రకటించింది. భారత్, ఇరాన్‌ మధ్య డీల్‌ కుదిరిన తర్వాత అమెరికా చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

డీల్‌పై స్పందించిన అమెరికా విదేశాంగ శాఖ..
ఇరాన్‌–భారత్‌ మధ్య కుదిరిన డీల్‌పై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ఆ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ మీడియాతో మాట్లాడారు. చాబహార్‌ ఓడరేవు నిర్వహణ కోసం భారత్‌ ఇరాన్‌ ఒప్పందం చేసుకున్నట్లు తెలిసిందన్నారు. టెహ్రాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు, దేశ విదేశాంగ విధాన లక్ష్యాలయపై ఢిల్లీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపారు. అయితే ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించిందన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ఏ సంస్థ అయినా.. ఏ దేశమైనా టెహ్రాన్‌తో లావాదేవీలు జరిపితే వారు కూడా ఆంక్షల చట్రంలో పడే ప్రమాదం ఉంటుందని పరోక్షంగా హెచ్చరించారు.

కీలక ఒప్పందం..
ఇదిలా ఉంటే.. మధ్య ఆసియా దేశాలతో భారత్‌ వాణిజ్యంం నెరపడానికి చాబహార్‌ పోర్టు ప్రధాన మార్గం. కజకిస్థాన్, కిర్గిజ్‌స్థాన్, తజకిస్థాన్, తుక్కెమిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌ వంటి దేశాలతో భారత్‌ నుంచి సరుకు రవాణా చేసుకోవచ్చు ఆఫ్గానిస్థాన్‌కు కూడా భారత్‌ అందించే ఆహార ధాన్యాలను ఈ మార్గంలోనే పంపిస్తారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ ఓడరేవులో పదేళ్లపాటు టెర్మినల్‌ నిర్వహణ కోసం భారత్, ఇరాన్‌ మధ్య సోమవారం ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో పతు దేశాలతో అనుసంధానంతోపాటు ద్వైపాక్షిక బంధాలు బలపడతాయి.