Jagan Cases: వైయస్ జగన్మోహన్ రెడ్డి పై( Y S Jagan Mohan Reddy) సిబిఐ కేసులు నమోదయి పుష్కరకాలం దాటుతోంది. 16 నెలల పాటు ఆయన జైలు జీవితం కూడా అనుభవించారు. అది రిమాండ్ ఖైదీ గానే. దాదాపు 43 వేల కోట్ల రూపాయల వరకు అక్రమంగా ఆర్జించారని జగన్మోహన్ రెడ్డి పై కేసులు నమోదు చేసిన సిబిఐ స్పష్టం చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా దానిని ధ్రువీకరించింది. గత 12 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై బయట ఉన్నారు. కానీ ఆ కేసుల్లో ఎటువంటి పురోగతి లేదు. ఎందుకంటే ఈ కేసు విచారణ చేపడుతున్న న్యాయమూర్తులు బదిలీలు, పదవి విరమణలు చూస్తుండడంతో మళ్లీ కేసు మొదటికే వస్తోంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి కేసులు విచారణ చేపడుతున్న నాంపల్లి సిబిఐ కోర్టు న్యాయమూర్తి రఘురాం బదిలీ జరిగింది. ఆయన స్థానంలో పట్టాభి రామారావు అనే కొత్త జడ్జి వచ్చారు. దీంతో ఈ కేసు మొదటికి వచ్చినట్లు అయింది. దేశంలోనే ఒక హై ప్రొఫైల్ కేసుగా ఉన్న.. విచారణలో మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
* పుష్కర కాలంగా విచారణలోనే..
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోపిడీ చేశారన్న ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి పై వచ్చాయి. 2010లో రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీతో విభేదించారు జగన్మోహన్ రెడ్డి. అప్పటికి ఆయనపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. సిబిఐ తో పాటు ఈడి ఎంట్రీ ఇచ్చింది. దీంతో జగన్మోహన్ రెడ్డి పై పదకొండు కేసులు నమోదయ్యాయి. దాదాపు 16 నెలల పాటు జైల్లోనే గడిపారు జగన్మోహన్ రెడ్డి. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాలన్నది కండిషన్. 2019 ఎన్నికల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి సంతకం పెట్టేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మినహాయింపు లభించింది కోర్టు హాజరుకు. అయితే ఈ కేసుల విచారణలో భాగంగా నిందితులనుంచి డిస్చార్జ్ పిటిషన్లు, ఆపై సాక్షుల విచారణలో జాప్యం జరగడం పరిపాటిగా మారింది. ఇప్పటికే ఈ కేసులో చాలామంది న్యాయమూర్తులు మారారు. ఇప్పుడు మరోసారి జడ్జి మారడంతో కేసు విచారణ మళ్లీ మొదటికి వచ్చినట్లు అయింది.
* వివేకానంద రెడ్డి హత్య కేసు సైతం..
మరోవైపు వైయస్ వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy ) హత్య కేసు కు సంబంధించి విచారణ కూడా ఇదే నాంపల్లి సిబిఐ కోర్టులో జరుగుతోంది. వివేక హత్య కేసు విచారణలో చాలామందిని విచారించాల్సి ఉందని.. అటువంటి వారిని విచారించకుండానే కేసు క్లోజ్ చేయడం తగదంటూ ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే కింది కోర్టులో తేల్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. దీంతో ఆమె నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులను విచారించాల్సిన పనిలేదని సిబిఐ కోర్టు స్పష్టం చేసింది. దీనిపై హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు సునీత. ఇంతలోనే ఇప్పుడు న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ కేసు సైతం డిఫెన్స్ లో పడింది. చూడాలి మరి ఏం జరుగుతుందో?