https://oktelugu.com/

AP volunteers : వాలంటీర్లను ఉంచుతారా? తొలగిస్తారా?

AP volunteers మరోవైపు పెంచిన పింఛన్ మొత్తాన్ని జూలై 1న అందించేందుకు సైతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే పెన్షన్లు ఎలా అందిస్తారు అన్నది కూడా ఈరోజు తేలిపోనుంది.

Written By:
  • NARESH
  • , Updated On : June 24, 2024 / 10:47 AM IST

    AP Volunteers

    Follow us on

    AP volunteers : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షిస్తూనే.. ఈ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించింది. ఎప్పటికీ సీఎం చంద్రబాబు 5 ఫైళ్లపై సంతకం చేశారు. 16,340 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి తొలి ఫైల్ పై చంద్రబాబు సంతకం చేశారు. సామాజిక పింఛన్లు మొత్తం పెంపు, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, నైపుణ్య గణన వంటి ఫైళ్ళపై ఇప్పటికే చంద్రబాబు సంతకం చేశారు. వాటి అమలుకు కసరత్తు చేస్తున్నారు. అటు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం పూర్తయింది. పాలనపై ప్రజాప్రతినిధులు ఫోకస్ పెట్టారు. ఇటువంటి తరుణంలో తొలిసారిగా ఈరోజు క్యాబినెట్ భేటీ జరుగుతుంది. మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా వాలంటీర్ల భవితవ్యం తేలనుంది. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా? లేకుంటే నిలిపివేస్తారా? రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి ఏంటి? చేయని వారిని ఎలా ఉపయోగించుకుంటారు? అన్న విషయాలపై ఈరోజు ఫుల్ క్లారిటీ రానుంది.

    వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించింది. ప్రతి 50 కుటుంబాల బాధ్యతను వారికి అప్పగించింది. పౌర సేవలతో పాటు సంక్షేమ పథకాల అమలు బాధ్యతలు అప్పగించింది. వైసిపి సర్కార్ కు రాజకీయంగా, నైతికంగా వాలంటీర్ వ్యవస్థ అండగా నిలిచింది. అయితే ఈ వలంటీర్ వ్యవస్థతో ఎన్నో రకాల దురాగతాలు జరుగుతున్నాయని అప్పట్లో విపక్షాలుగా ఉన్న టిడిపి, జనసేన ఆరోపించాయి. నేపథ్యంలో వారి సేవలను నిలిపివేయాలన్న ఫిర్యాదులతో ఎలక్షన్ కమిషన్ స్పందించింది. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత వారి సేవలను నిలిపివేసింది. దీనిపై నిరసనగా చాలామంది వాలంటీర్లు.. వైసిపి నేతల ఒత్తిడి మేరకు రాజీనామా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు గాను.. లక్ష మంది వరకు రాజీనామా చేశారు. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు రాజీనామా చేయవద్దని.. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు కొనసాగిస్తామని.. పదివేల రూపాయల వేతనంతో పాటు ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాలంటీర్ వ్యవస్థ పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది సస్పెన్స్ గా మారింది.

    తామంతా వైసీపీ నేతల ఒత్తిడితో రాజీనామా చేయాల్సి వచ్చిందని.. తమనే కొనసాగించాలని కొంతమంది వాలంటీర్లు తాజాగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే మీతో బలవంతంగా రాజీనామా చేయించిన వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని.. అటువంటి వారిని కొనసాగిస్తామని కొంతమంది మంత్రులు ప్రకటించడంతో.. రాష్ట్రవ్యాప్తంగా రాజీనామా చేసిన వాలంటీర్లు కొంతమంది స్వచ్ఛందంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం కనిపించింది. వాస్తవానికి వాలంటీర్లంతా వైసీపీ సానుభూతిపరులే. వారిని కొనసాగించే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు వాలంటీర్ల వ్యవస్థపై టిడిపి శ్రేణులు సైతం ఆశలు పెట్టుకున్నాయి. వాలంటీర్ల వ్యవస్థపై విధివిధానాలు తయారు చేసే పనిలో ప్రభుత్వం ఉందని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి చెప్పుకొచ్చారు. ఈరోజు మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ వ్యవస్థ పై ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. అయితే మొత్తం వ్యవస్థను రద్దు చేసి.. నూతన నియామక ప్రక్రియ చేపడుతారా? లేకుంటే రాజీనామా చేయని వారిని కొనసాగించి.. అదనంగా మరికొందరిని భర్తీ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు పెంచిన పింఛన్ మొత్తాన్ని జూలై 1న అందించేందుకు సైతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే పెన్షన్లు ఎలా అందిస్తారు అన్నది కూడా ఈరోజు తేలిపోనుంది.