BJP Purge : దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ భారీ ప్రక్షాళనకు దిగింది. అయితే పార్టీకి నష్టమా? లాభమా? అంటే మాత్రం సరైన సమాధానం దొరకడం లేదు. ఒక ప్రయోగం మాత్రమే చేశారు. దాని తాలుకా పర్యవసానాలు, ప్రయోగాలు కొద్దిరోజులు ఆగితే కానీ తెలియవు. ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో సారధులనే మార్చేశారు. అందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయితే దశాబ్ద కాలంగా వస్తున్న సామాజికవర్గ స్ట్రాటజీని పక్కనపడేశారు. ఏపీలో కాపులను, తెలంగాణలో మున్నూరు కాపులను తప్పించారు. ఏపీకి కమ్మ సామాజికవర్గానికి చెందిన పురంధేశ్వరి, తెలంగాణకు కిషన్ రెడ్డిని నియమించారు. అయితే వీరి నియామకం ద్వారా హైకమాండ్ ఏం ఆశిస్తున్నదో మాత్రం తెలియడం లేదు. కానీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సాధారణంగా రాజకీయ పార్టీలు ప్రయోగాలు చేస్తాయి. ఒక్కోసారి సక్సెస్ అవుతాయి. లేకుంటే అట్టర్ ప్లాఫ్ అవుతాయి. కొన్నిసార్లు ప్రయోగాలు ఆత్మహత్య సదృశ్యమే. ఢిల్లీలో ఇలాంటి ప్రతికూల ఫలితాలనే బీజేపీ చవిచూసింది. 2014 ఎన్నికల తరువాత ఓ ప్రయోగం చేపట్టి చేతులు కాల్చుకుంది. 2014 ఎన్నికల్లో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఏకంగా 7 ఎంపీ సీట్లను గెలుచుకుంది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ను అడ్డుకట్ట వేసేందుకు కిరణ్ బేడీని రంగంలోకి దించింది. అప్పటివరకూ హర్షవర్ధన్ అనే నాయకుడు బీజేపీని బలీయమైన శక్తిగా మార్చినా పక్కన పెట్టారు. కిరణ్ బేడీని తెచ్చినా ఆమె పార్టీని ఊపు తేలేకపోయారు. అప్పటివరకూ పనిచేసిన పార్టీ శ్రేణులు నీరుగారిపోయారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. తరువాత ఇప్పటివరకూ అక్కడ కోలుకోలేదు.
అయితే ఇప్పుడు కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న కాషాయదళం సర్వశక్తులను ఒడ్డుతోంది. అందులో భాగంగానే నాలుగు రాష్ట్రాల సారధులను మార్చింది. మరో ఆరు రాష్ట్రాల్లో నాయకత్వాలను మార్చనున్నట్టు తెలుస్తోంది. అయితే జాతీయ అధ్యక్షుడు నడ్డా పదవీ కాలం కూడా ముగిసింది. కానీ ఆయన్ను మార్చలేదు. ఆయనతో నియమితులైన సోము వీర్రాజు, బండి సంజయ్ లను మార్చారు. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.పైగా గతానికి భిన్నంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. త్రిపురలో ఇలానే ప్రయోగం చేశారు. అక్కడ వర్కవుట్ అయ్యేసరికి.. అదే ఫార్ములాను మిగతా చోట్ల విస్తరిస్తున్నారు. అయితే అది ఎంతవరకూ లాభిస్తుందో చూడాలి మరీ. మరోవైపు విపక్ష కూటమి మొహరించి ఉంది. ఇటువంటి సమయంలో ప్రయోగాలు అవసరమా? అని భారతీయ జనతా పార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కానీ ప్రస్తుతం పార్టీలో మోదీ, షా ద్వయం మాటకు తిరుగులేదు. సీనియర్లు అచేతనం, జూనియర్ల బంధనంతో తిరుగులేని శక్తిగా ఆ ద్వయం ఉంది. అందుకే వారి నిర్ణయాలు పక్కాగా అమలవుతున్నాయి. ఇప్పుడు ఈ భారీ ప్రక్షాళన అందులో భాగమే. మరి ఇది ఎంతవరకూ ఫలితమిస్తుందో చూడాలి మరీ.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Will bjps experiment work does it fade
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com