Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. ‘పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే’.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట. గోదావరిలోకి కొత్తనీరు రాగానే పులసల సందడి మొదలయ్యేది. మాంసాహార ప్రియులు వీటి కోసం తెల్లవారుజామునే గోదావరి తీరాన క్యూ కట్టేవారు. కానీ ఈ ఏడాది గోదారిలో పులస కనిపించడం లేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. గోదావరిలో నీరు అంతంతమాత్రంగా ఉంది. కొత్తనీరు రావడం లేదు. పులసలు కనిపించడం లేదు. గోదావరి జిల్లాల ప్రజల సెంటిమెంట్ కొనసాగడం లేదు. ఈ పులస రుచిలోనూ, శుచిలోను, ఆరోగ్యం ఇవ్వడంలోనూ ప్రత్యేకత. అందుకే గోదావరి ప్రజలు అతిధి మర్యాదలకు పులసను ఎక్కువగా వాడుతారు. ఎంత ధర ఇచ్చైనా కొనుగోలు చేస్తారు. కానీ ఈ ఏడాది మచ్చుకైనా పులస దొరకడం లేదు.
* సంతానోత్పత్తి కోసం..
బంగాళాఖాతంలో ఉండే ఇలస చేపలు సంతాన ఉత్పత్తి కోసం గోదావరిలోకి ప్రవాహానికి ఎదురు ఈదుకుంటూ వస్తాయి. ఎర్ర నీటిలో ప్రవేశించిన తర్వాత వీటిని పులసలుగా పిలుస్తారు. అయితే దీని ప్రత్యేక రుచి వల్ల అధిక డిమాండ్ ఏర్పడింది. కానీ గత కొన్నేళ్లుగా గోదావరిలో జల కాలుష్యంతో గుడ్లు పెట్టకుండానే వలలకు చిక్కడంతో సంతానం వృద్ధి చెందడం లేదు. గతంలో విరివిగా పులసలు లభించేవి. మూడేళ్ల కిందట గోదావరిలో అధికంగా లభ్యమయ్యాయి. కానీ క్రమేపి వీటి లభ్యత తగ్గింది. గత ఏడాది నుంచి పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఒకటో రెండో దొరికితే ధర భారీగా పెరిగింది. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వర్షాల జాడలేదు. గోదావరిలో కొత్తనీరు చేరడం లేదు. ప్రతిరోజు పులస చేపల కోసం గోదావరి నది తీరం గోడితిప్ప, బోడసకురు గ్రామాల్లో ప్రజలు వేచి చూస్తుంటారు. కానీ మత్స్యకారులకు ఇవి చిక్కక పోవడంతో నిరాశతో వెనుతిరుగుతుంటారు.
* ఈ ప్రాంతాల్లో అధికం..
ధవలేశ్వరం బ్యారేజీ, పొట్టిలంక, పి గన్నవరం, బోడసకుర్రు, యానాం, రబ్బనపల్లి, కోడితిప్ప గ్రామాల్లో గోదావరిలో దొరికే పులస చేపలకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో మాంసాహారులు ఈ ప్రాంతాల్లో వేటసాగించే మత్స్యకారులకు ముందస్తుగా నగదు ఇస్తున్నారు. కానీ ఈ ఏడాది ఎక్కడ పులస చేపల లభ్యత లేదు. దీంతో అటు మత్స్యకారులతోపాటు ఇటు మాంసప్రియలకు సైతం నిరాశ తప్పడం లేదు. పర్యావరణ మార్పులు, లోటు వర్షపాతం, ప్రవాహ మార్పులు చాపల జీవన విధానం పై ప్రభావం చూపుతున్నాయి. నదుల్లో పారిశ్రామిక, ఇతర కాలుష్యాలు పెరిగిపోవడంతో నాణ్యత తగ్గుతోంది. సాధారణంగా ఇవి సముద్రం నుంచి జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో గుడ్లు పెట్టేందుకు నదిలోకి వస్తాయి. ఇవి ఒడిస్సా లోని మహానదిలోకి కూడా ప్రవేశించి పులసలుగా మారుతుంటాయి. అయితే గోదావరి నదిలో దొరికే పూలసరుచి ఒడిస్సా దొరికే చేపలకు ఉండదని మత్స్యకారులు చెబుతున్నారు.
* పోషక విలువలు అధికం..
పులస చేప అనేది కేవలం అతిధి మర్యాదలకు మాత్రమే కాదు. చాలా పోషక విలువలు అందులో ఉంటాయి. ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మెదడు పనితీరు మెరుగుదలకు, రక్తనాళాలకు, కళ్ళకు, ఎముకులకు ఈ చేపల్లోని ఔషధ గుణాలు పనిచేస్తాయి. పోషకాలకు సంబంధించి క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, విటమిన్ బి12, విటమిన్ సి ఎక్కువగా ఇవి తినడం వల్ల లభ్యమవుతాయి. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర తీరప్రాంతాల నుంచి.. హిందూ మహాసముద్రం ద్వారా బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తాయి. సముద్రంలో ఉన్నంతకాలం వీటిని ఇలస అని పిలుస్తారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో గోదావరికి వరదలు వచ్చే సమయంలో నదిలోకి ఎదురీదుకుంటూ వస్తాయి. కానీ ఈ ఏడాది వాటి జాడలేదు. మత్స్యకారులకు గిట్టుబాటు కావడం లేదు. మాంసప్రియలకు నిరాశ తప్పడం లేదు.








