MLA Arikepudi Gandhi: శేర్లింగంపల్లి నియోజకవర్గంలో గులాబీ పార్టీ గుర్తు మీద 2023 లో జరిగిన ఎన్నికల్లో అరికెపూడి గాంధీ ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు ఎన్నికల కూడా ఆయన విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లోను ఆయన ఎమ్మెల్యేగా గెలుపును సందం చేసుకున్నారు. మొత్తంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2016లో ఆయన గులాబీ పార్టీలో చేరారు. అప్పట్లో ఆయన చేరికను కెసిఆర్ రాజకీయ పునరేకి కరణ గా పేర్కొన్నారు.
ఇక 2023 లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన గాంధీ… ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈయనకు ప్రజాప్రతిల కమిటీ చైర్మన్ పదవి ఇచ్చింది. అతడికి ఆ పదవిని ఇవ్వడాన్ని భారత రాష్ట్ర సమితి తప్పు పట్టింది. ఆ తర్వాత గులాబీ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, గాంధీ మధ్య మాటల యుద్ధం సాగింది. ఒకానొక దశలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం దాడులకు పాల్పడతాం అన్నట్టుగా సంకేతాలు కూడా ఇచ్చారు. ఇరువురికి చెందిన అనుచరులు రచ్చ రచ్చ చేశారు. అప్పట్లో ఈ రెండు వర్గాల మధ్య జరిగిన సంఘటనలు హైదరాబాద్ లో సంచలనం సృష్టించాయి.
కాంగ్రెస్ పార్టీకి గాంధీ దగ్గర కావడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని అప్పట్లో భారత రాష్ట్ర సమితి ఆరోపించింది. ఇప్పుడిక సరికొత్త విషయాన్ని బయటపెట్టింది. గులాబీ పార్టీ నేత లక్ష్మారెడ్డి కీలక ఆధారాలను సేకరించి ఏకంగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో సర్వేనెంబర్ 307 లోని 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని గాంధీకి అక్రమంగా బదిలీ చేశారని లక్ష్మారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వే నెంబర్ 307 లో సీలింగ్ కింద ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన ప్రైవేట్ భూమిలో ఇప్పటికే కొంతమంది పూర్తిగా ఇండ్లు నిర్మించుకున్నారు.
అక్కడ ఎటువంటి ప్రవేట్ భూమి లేదని.. అయితే తమ పేరు మీద ఉన్న 11 ఎకరాలు ఎప్పుడో అమ్మేసి వెళ్లిపోయిన జాహేద్ బేగం, షేక్ ఇమామ్, ఇషాన్ ఆమీన్ అనే వ్యక్తులను తీసుకొచ్చి.. వారి భూమిని గాంధీ కొన్నట్టుగా చూస్తూ మోసానికి తెర లేపారని లక్ష్మారెడ్డి ఆరోపించారు. వాస్తవానికి ఆ ముగ్గురి వద్ద ఎటువంటి భూమి లేదని.. అక్రమంగా రిజిస్ట్రేషన్ లు చేయించి 11 ఎకరాల భూమిని స్వాహా చేయడానికి పథకం రూపొందించారని లక్ష్మారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ 11 ఎకరాల భూమి ప్రభుత్వానికి సంబంధించిందని.. ఇందులో అక్రమంగా చేర్చిన వారి పేర్లను తొలగించాలని.. ఆర్డిఓ సర్టిఫై చేసిన నాలా ప్రొసీడింగ్స్ రద్దు చేయాలని.. ఆ స్థలంలో బహుళ అంతస్తుల నిర్మాణానికి చేపడుతున్న ప్రణాళికలను అడ్డుకోవాలని ఆయన కోరారు.. లక్ష్మారెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ లో ఎమ్మెల్యే గాంధీ, ఆయన భార్య శ్యామల దేవి, కుమార్తె నందిత, ఏడుగురు ప్రవేట్ వ్యక్తులు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఈ కేసును విచారించిన ధర్మాసనం భూ బదిలీపై కుత్బుల్లాపూర్ ఎమ్మార్వోకు ఫిర్యాదు చేయాలని.. ఒకవేళ ఆయన గనుక స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని పేర్కొంది. ఎమ్మార్వోకు ఫిర్యాదు చేసే విషయమైతే.. తమ పిటిషన్ వెనక్కి తీసుకుంటామని.. లక్ష్మణ్ రెడ్డి తరఫున న్యాయవాది పేర్కొన్నారు. దానికి న్యాయవాది అనుమతులు జారీ చేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో లక్ష్మారెడ్డి కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే ఈ భూ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.