Sugali Preethi case: ఇప్పుడు ఈ జాబితాలోకి సుగాలి ప్రీతి కేసు కూడా చేరిపోయినట్టు కనిపిస్తోంది.. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నగర్ శివారు ప్రాంతంలో లక్ష్మీ గార్డెన్లో రాజు నాయక్, పార్వతి దేవి దంపతులు నివసిస్తున్నారు. వీరి కుమార్తే సుగాలి ప్రీతి భాయి. కర్నూల్ లోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో ఆమె పదో తరగతి చదివేందుకు చేరింది. పదో తరగతి చదువుతుండగానే 2017 ఆగస్టు 19న ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయినట్టు పాఠశాల యాజమాన్యం రాజు నాయక్, పార్వతి దేవికి సమాచారం అందించింది. అయితే ప్రీతి చనిపోయిన దృశ్యాలను చూసిన రాజునాయక్, పార్వతి దేవి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అంతేకాదు తమ కూతురిపై పాఠశాల యజమాని కొడుకులు చేయకూడని పనిచేసి.. చంపేశారని ఆరోపించారు.. ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.. ఆమెపై దారుణం జరిగిందని వెల్లడించారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రి పేతాలసీ హెచ్వోడి కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. దీనిపై నివేదిక కూడా ఇచ్చారు.
ఆ ఆధారాలతో..
సుగాలి ప్రీతి పై జరిగిన దారుణాన్ని వెల్లడిస్తూ.. దానికి సంబంధించిన ఆధారాలను బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాల యజమానితో పాటు అతడి కుమారులు నిందితులని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. నాడు పార్వతి దేవి, రాజు నాయక్ ఫిర్యాదుతో పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.. ఈ ఘటనపై అసలు విషయాలు తేల్చేందుకు అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సుగాలి ప్రీతి దేహం పై ఉన్న గాయాలు.. అక్కడి దృశ్యాలపై ఆ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమానం కూడా ఉందని పేర్కొంది. ఆమెను అంతమొందించారని.. చేయకూడని పని చేశారని నివేదిక కూడా ఇచ్చింది. దానికి సంబంధించిన సాక్షాలను కూడా సేకరించింది. అయితే అప్పుడు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కేవలం 23 రోజులు మాత్రమే జైల్లో ఉన్నవారు బెయిల్ తెచ్చుకున్నారు.. అయితే దీనిని నిరసిస్తూ ప్రీతి తల్లిదండ్రులు కర్నూల్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ఇందులో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యారో.. అప్పుడే చర్చనీయాంశంగా మారింది.. ఆ తర్వాత ఈ కేసు సిబిఐ దాకా వెళ్ళింది. అయితే ఇప్పుడు సిబిఐ ఈ కేసును పరిష్కరించలేమని.. తమ పరిధిలో నుంచి తీసివేస్తూ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు విన్నవించడం సంచలనంగా మారింది. మరి ఈ కేసు ఎప్పుడు పరిష్కారం అవుతుందో.. సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు న్యాయం ఎప్పుడు జరుగుతుందో.. వేచి చూడాల్సి ఉంది.