Andhra Pradesh: గెలుస్తామన్న వైసీపీకి కాకుండా.. కూటమికి జై కొడుతున్న అధికారులు

పోలింగ్ నాడు, పోలింగ్ ముగిసిన తర్వాత ఏపీలో హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి ఒక రకమైన వాదన వినిపించింది.

Written By: Dharma, Updated On : May 21, 2024 12:10 pm

Why Govt Officials are supporting Alliance in AP

Follow us on

Andhra Pradesh: సాధారణంగా పోలింగ్ కు, కౌంటింగ్ కు మధ్య వింత పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా అధికారంలోకి వచ్చే పార్టీకే అధికారులు సెల్యూట్ చేస్తారు. ఆ పార్టీకి అనుగుణంగా పనిచేస్తారు. అయితే ఏపీలో పోలింగ్ ముగిసింది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అన్ని పార్టీలు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సీఎం జగన్ ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లి మరి మనం విజయం సాధిస్తున్నామని చెప్పి విదేశాలకు వెళ్లిపోయారు. అటు టిడిపి కూటమి సైతం విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. 130 కు పైగా స్థానాలను గెలుపొందుతామని చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో వైసీపీలో మాత్రం ఆ ధీమా కనిపించడం లేదు. మొన్నటి వరకు వై నాట్ 175 అన్నవారు.. తక్కువ మెజారిటీతోనైనా విజయం సాధిస్తామని చెప్పుకుంటున్నారు. అయితే అదే సమయంలో పోలింగ్ వ్యవహార శైలిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.టిడిపి కూటమికి పోలీసులు,పోలింగ్ అధికారులు సహకరించారని ఆరోపించారు.

పోలింగ్ నాడు, పోలింగ్ ముగిసిన తర్వాత ఏపీలో హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి ఒక రకమైన వాదన వినిపించింది. టిడిపి కూటమికి అధికారుల సహకారం ఉందన్నది వారి విమర్శ. అయితే వైసీపీ విజయం సాధిస్తే ఎదురయ్యే పరిణామాలు అధికారులకు తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీకి కాదని టిడిపి కూటమి పార్టీలకు సహకారం అందించడం దేనికి సంకేతం. వైసిపి గెలుపొందుతుందని తెలిసి వారు టిడిపి కూటమికి సహకరించే ఛాన్స్ ఉందా? మొన్నటి వరకు వైసీపీ నేతల కనుసన్నల్లో ఉన్న అధికారుల్లో సడన్ చేంజ్ ఏంటి? అంటే మాత్రం ఆసక్తికరమైన చర్చ ఒకటి బయటకు వస్తుంది.

గత ఎన్నికల్లో అధికార పార్టీగా టిడిపి ఉండేది.ఆ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు వైసీపీని ఆదరించారు. వైసిపి వస్తే తమకు న్యాయం జరుగుతుందని భావించారు. అప్పటి టిడిపిని తిరస్కరించారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం వైసీపీని విపరీతంగా వ్యతిరేకించారు. తాము వ్యతిరేకంగా ఓటు వేయడమే కాదు… సమాజంలో చాలా రకాలుగా ప్రభావితం చూపారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేక భావన పెరిగేలా పావులు కదిపారు. వారే ఎన్నికల నిర్వహకులుగా ఉండడంతో ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో.. అన్ని రకాలుగా చేసేశారు. అయితే ఒకవైపు గెలుస్తామని చెబుతున్న వైసిపి నేతలు.. అధికారులు, పోలీసులు టిడిపి కూటమికి మద్దతు తెలిపారని చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. వైసిపి గెలుస్తుందని భావిస్తే యంత్రాంగం టిడిపి కూటమికి మద్దతు తెలపడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గెలిచే పార్టీకే వారు జై కొడతారని.. ఇది చాలా ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ అని.. వైసీపీ లెక్క తప్పుతోందన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. వైసీపీకి కూడా ఫలితాలపై ఒక క్లారిటీ ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.