AP Election Results: ఏపీలో ఆ పార్టీదే గెలుపు.. కుండ బద్దలు కొట్టిన ప్రముఖ సెఫాలజిస్ట్

మరోవైపు జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధం. అయితే ఇంతలో సెఫాలజిస్టులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయో విశ్లేషిస్తున్నారు.

Written By: Dharma, Updated On : May 21, 2024 12:19 pm

AP Election Result 2024 Predicts

Follow us on

AP Election Results: దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఏపీ పైనే ఉంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే నోటిఫికేషన్ కు, పోలింగ్కు మధ్య 50 రోజుల గ్యాప్ లభించింది. ఓటు పై అవగాహన పెరగడంతో ఓటింగ్ శాతం పెరిగింది. దేశంలో కనివిని ఎరుగని రీతిలో 82 శాతం పోలింగ్ నమోదు కావడం రికార్డ్ సృష్టించింది. గెలుపు పై అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి. నేతలు ఒక అడుగు ముందుకేసి.. తమ పార్టీ అధినేతలు ఫలానా రోజు ప్రమాణస్వీకారం చేస్తారని ప్రకటించడం ఆశ్చర్యం వేస్తోంది. మరోవైపు జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధం. అయితే ఇంతలో సెఫాలజిస్టులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయో విశ్లేషిస్తున్నారు.

ఏపీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి సేఫాలజిస్ట్ గా పేరుపొందిన ప్రశాంత్ కిషోర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైసిపికి దారుణ ఓటమి ఎదురు కానుంది అని తేల్చేశారు. ఎక్కువమంది సెఫాలజిస్టులు కూటమి గెలుస్తుందని స్పష్టం చేశారు. తాజాగా సిఎస్డిఎస్ నుంచి ప్రముఖ సెఫాలజిస్ట్ సంజయ్ కుమార్ ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందో తేల్చి చెప్పారు. న్యూస్ ఛానల్ డిబేట్లో ఆయన ఏపీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వైసిపి వర్సెస్ టిడిపి కూటమి మధ్య గట్టి ఫైట్ ఉంటుందని తేల్చారు. అయితే ఈ యుద్ధంలో టిడిపిదే పైచేయి అని తేల్చేశారు. కానీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో సీట్ల గురించి ప్రస్తావించలేదు. టిడిపి ఘన విజయం సాధిస్తుందని మాత్రం చెప్పుకొచ్చారు. ఏపీలో బిజెపికి బలం లేకున్నా.. టిడిపితో కలవడం ద్వారా కొన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందని అభిప్రాయపడ్డారు.

అయితే దాదాపు అందరూ సెఫాలజిస్టులు ఒకే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం పై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వైసీపీకి అనుకూలమైన వ్యక్తిగా మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ ను మిగతా రాజకీయ పక్షాలు చెబుతుంటాయి. ఆయన సైతం ఏపీలో టిడిపి కూటమికే ఛాన్స్ ఉంటుందని అభిప్రాయం వచ్చేలా మాట్లాడినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు సంజయ్ కుమార్ సైతం ఆ అభిప్రాయానికి రావడం విశేషం. ఈయన నిక్కచ్చిగా విశ్లేషిస్తారని జాతీయస్థాయిలో మంచి పేరు ఉంది. అటువంటి వ్యక్తి నోటి నుంచి టిడిపి కూటమి గెలుస్తుందని రావడం ఆ పార్టీలో ఆనందం నింపుతోంది. వైసిపి లో నిరాశ అలుముకుంది.