RK Kotha Paluku: ఓవైపు బాలయ్య వ్యాఖ్యలు.. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఇంకా ఏపీవ్యాప్తంగా అనేక పరిణామాలు.. తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితులు.. ఇన్నింటి మధ్య ఏవేవో వార్తలు వస్తున్నాయి. కానీ లోతైన విశ్లేషణలు మాత్రం కనిపించడం లేదు. వినిపించడం లేదు. వాస్తవానికి ఇటువంటి విషయాలు రాయాలంటే తెలుగులో సుప్రసిద్ధ పాత్రికేయుడు వేమూరి రాధాకృష్ణ వల్ల మాత్రమే అవుతుంది. అందువల్లే ఆయన ప్రతి ఆదివారం తన పత్రిక ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు పేరుతో వర్తమాన రాజకీయాల మీద విశ్లేషణ చేస్తూ ఉంటారు. తనకు మాత్రమే తెలిసిన సమాచారానికి మాల్ మసాలా దంచి వడ్డిస్తుంటారు. నచ్చేవాళ్ళు నచ్చుతుంటారు.. నచ్చని వాళ్ళు తిడుతుంటారు. కాకపోతే ఆయన వండే వంటకం మాత్రం అదిరిపోతుంది. ఏక్ దమ్ దమ్ బిర్యాని లాగా ఉంటుంది. కడక్ చాయ్ తాగినంత వెచ్చగా ఉంటుంది.
కానీ ఈ ఆదివారం ఎందుకో రాధాకృష్ణ తన కొత్త పలుకు రాయలేదు. ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతి పత్రిక చదివే వారికి కొత్త పలుకు కొత్త పరిచయం ఏమి కాదు. అందులో ఉన్న విషయాలు చాలా ఘాటుగా ఉంటాయి. స్పైసీ స్పైసీగా కనిపిస్తుంటాయి. కొన్ని రాజకీయ పార్టీలకు ఆయన రాసే రాతలు కొత్త ఆయుధాల మాదిరిగా.. మరి కొన్ని రాజకీయ పార్టీలకు ఇబ్బందికరంగా ఉంటాయి. ఏవి ఎలా ఉన్నప్పటికీ.. ఎవరు ఏమీ అనుకున్నప్పటికీ రాధాకృష్ణ మాత్రం రాస్తూనే ఉంటాడు. రాసే విషయంలో రాజీ ఉండదు. మొహమాటం అసలు ఉండదు. షర్మిల పార్టీ పెడుతుందన్న.. కేటీఆర్, కెసిఆర్ కు కవిత దూరంగా ఉంటుందన్న విషయాలను రాధాకృష్ణ మాత్రమే రాశాడు. ఆయన మాత్రమే చెప్పగలిగాడు.
అప్పట్లో ఆయన రాసిన ఈ మాటలను చాలామంది తిట్టుకున్నారు. మెజారిటీ వర్గాలు విమర్శించుకున్నారు. కానీ అంతిమంగా మాత్రం రాధాకృష్ణ తన రాసిన రాతల మీద నిలబడ్డాడు. తాను పలికిన మాటల మీద స్థిరపడ్డాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయన రాసిన రాతల మాదిరిగానే ఉన్నాయి. అప్పటిదాకా ఆయన విమర్శించిన వారు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇక వర్తమాన రాజకీయాలను విశ్లేషించడంలో రాధాకృష్ణ తర్వాతే ఎవరైనా. చంద్రబాబు విషయంలో కూడా అప్పుడప్పుడు రాధాకృష్ణ తన లైన్ దాటుతుంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఎటువంటి మొహమాటం లేకుండానే రాధాకృష్ణ రాస్తున్నారు. చంద్రబాబు దగ్గర వాడని.. అనేక ఇబ్బందులు ఎదుర్కొని అధికారంలోకి వచ్చాడని వాత్సల్యం చూపించడం లేదు. రేవంత్ విషయంలో కూడా అలానే వ్యవహరిస్తున్నారు. అందువల్లే ఆంధ్రజ్యోతి ఇప్పుడు నిప్పు కణికలాగా కనిపిస్తోంది. ఇంతటి టెంపర్ మెంట్ చూపించే రాధాకృష్ణ అప్పుడప్పుడు బ్రేక్ ఇవ్వడం అసలు బాగుండడం లేదు. అన్నట్టు బ్రేక్ వచ్చిందా.. తీసుకున్నారా.. జర చెప్పండి ఆర్కే సార్! మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ..