Jagan Delhi Tour
Jagan Delhi Tour: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. తిరిగి అమరావతి చేరుకున్నారు. అయితే ఆయన ప్రధాని మోదీని కలిసి ఏం చర్చించారు? రాజకీయాలా? పాలనాపరమైన అంశాల? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. చంద్రబాబు వెళ్లి పొత్తులపై చర్చించారు కాబట్టి.. జగన్ కూడా రాజకీయాలే చర్చించి ఉంటారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన వైపు వెళ్లొద్దని.. తనకు 25 పార్లమెంటు స్థానాలు వస్తాయని.. ఇప్పటి మాదిరిగానే మీకు అన్ని విధాలా సహకారం అందిస్తానని జగన్ మోడీతో చెప్పి ఉంటారని టాక్ నడుస్తోంది.
అయితే బిజెపి పెద్దలు జగన్ ను పిలిచారా? లేకుంటే జగన్ నేరుగా వెళ్లి కలిశారా? అన్న విషయంలో స్పష్టత లేదు. వాస్తవానికి జగన్ ఈనెల 11న ఢిల్లీ వెళ్తారని వార్తలు వచ్చాయి. కానీ రెండు రోజులు ముందుగానే ఆయన ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా బిజెపికి సంబంధించి రాజకీయ వ్యూహాలు అమిత్ షా, జేపీ నడ్డా చూస్తారు. ప్రధాని కేవలం పాలనాపరమైన అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఏమైనా మాట్లాడాలని ఉంటే.. అమిత్ షా తో మాట్లాడాలని సూచిస్తారు. అయితే నిన్న ఢిల్లీలో అడుగుపెట్టిన జగన్ కు అమిత్ షా అపాయింట్మెంట్ లభించలేదు. ఈరోజు సైతం కేవలం ప్రధాని మోదీతో సమావేశానికి పరిమితమయ్యారు.
అయితే కేవలం జగన్ ప్రధాని మోదీతో సమావేశం కావడం గమనార్హం. ఏకంగా గంటన్నర పాటు చర్చలు జరపడం కూడా కీలకంగా మారింది. సాధారణంగా ఎన్నికల ముంగిట, ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానిని కలుస్తారు. కీలక అంశాలను చర్చిస్తారు. పోలవరం ప్రాజెక్టు నిధుల రీయంబర్స్మెంట్, విభజన హామీల్లో భాగంగా కేంద్రం నుంచి కొంత మొత్తం నిధులు రావాల్సి ఉంది. వాటి కోసమే జగన్ ప్రధాని మోదీని కలిసి ఉంటారని టాక్ నడుస్తోంది. సరిగ్గా బిజెపితో పొత్తుల సమయంలోనే.. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత… వ్యూహత్మకంగానే జగన్ కలిసి ఉంటారని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. మరోవైపు అమిత్ షా అపాయింట్మెంట్ దొరకకపోవడంతో జగన్ నిరాశతో వెనుతిరిగారని.. ఆయన అసలు లక్ష్యం నెరవేరలేదని మరోవైపు టాక్ నడుస్తోంది. ఎవరికి నచ్చిన విశ్లేషణలు వారు చేస్తున్నారు. అందులో వాస్తవం ఎంత ఉందో ఆ దేవుడికే తెలియాలి.