AP Politics: ఆ అధికారులు రాష్ట్రం దాటి వెళ్తున్నారు ఎందుకు?

జగన్ కోటరీలో ఉండే కీలక అధికారుల్లో షం షేర్ సింగ్ రావత్ ఒకరు.ఆర్థిక శాఖలో కీలక అధికారిగా వ్యవహరించారు. సంక్షేమ పథకాల కోసం అడ్డగోలుగా అప్పుల చేయడంలో ఆయన ముందుండేవారు.

Written By: Dharma, Updated On : May 29, 2024 7:24 pm

AP Politics

Follow us on

AP Politics: గత ఐదేళ్ల వైసిపి పాలనలో మంత్రుల అధికారాలు, విధులు అంతంత మాత్రమే. మంత్రులుగా ప్రాతినిధ్యం వహించిన వారు తమ శాఖలపై అంతగా పట్టు సాధించిన దాఖలాలు లేవు. వాస్తవానికి చెప్పాలంటే జగన్ బ్యూరోక్రాసి వ్యవస్థ పైన ఎక్కువ ఆధారపడ్డారు. వారితోనే తన ఐదేళ్ల పాలన ముగించారు. అటు అధికారులు సైతం.. తాము అధికారులం కాదన్న రీతిలో వ్యవహరించారు. వైసీపీ సర్కార్కు వీర విధేయత చూపారు. ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వామ్యం అయ్యారు. అడ్డగోలుగా వ్యవహరించారు. ఇప్పుడు వైసీపీ అధికారానికి దూరం కానుండడంతో.. రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. తమను తెలంగాణకు బదిలీ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు.

జగన్ కోటరీలో ఉండే కీలక అధికారుల్లో షం షేర్ సింగ్ రావత్ ఒకరు.ఆర్థిక శాఖలో కీలక అధికారిగా వ్యవహరించారు. సంక్షేమ పథకాల కోసం అడ్డగోలుగా అప్పుల చేయడంలో ఆయన ముందుండేవారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, రిజర్వ్ బ్యాంక్ అనుమతులు తీసుకొని అప్పులు పుట్టించడంలో రావత్ కృషి ఎంతో ఉంది. ముఖ్యంగా జగన్ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో షంషేర్ సింగ్ రావత్ చాలా కష్టపడ్డారు. అయితే ఆయన తెలంగాణకు పోస్టింగ్ ఇవ్వాలని ఇటీవలే దరఖాస్తు చేసుకున్నారు.

జగన్ కు అత్యంత విధేయత చూపే అధికారి వెంకట్ రెడ్డి. గనుల శాఖలో కీలక అధికారిగా ఉన్నారు. అడ్డగోలు జీవోలు, అనుమతులు జారీ చేయడంలో ముందుండేవారు. ఒకవేళ మీడియాలో ఎటువంటి కథనాలు వచ్చిన మరుక్షణం ఖండించేవారు. ప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇచ్చేవారు. గనుల శాఖ పరంగా తీసుకునే అనేక నిర్ణయాల వెనుక వెంకట్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఆయన వేరే రాష్ట్రానికి కానీ.. తెలంగాణకు కానీ తనను బదిలీ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు.

మరో ముఖ్య అధికారి వాసుదేవ రెడ్డి సైతం ఈ రాష్ట్రం నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ మద్యం దుకాణాల పెంపు, చీప్ లిక్కర్ పారించడంలో ముందుండేవారని విపక్షాలు ఆరోపించేవి. వైసిపి నేతల బేవరేజెస్ నుంచి నాసిరకం మద్యం కొనుగోలు చేయడంలో వాసుదేవ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఈయన సైతం వేరే రాష్ట్రానికి వెళ్లిపోతానని దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారుతోంది. ఏదో తేడా కొడుతోంది అన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు జగన్కు అత్యంత వీర విధేయులైన అధికారులే చేతులెత్తేయడంతో.. ప్రభుత్వం మారడం ఖాయం అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.