Janasena Glass Symbol: గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది అంటూ ఇటీవల పవన్ ఓ సినిమాలో డైలాగ్ చెప్పారు. పదును మాట సరే కానీ.. అదే వాడితో కూటమి ఓట్లు కూడా చీల్చే ప్రమాదం కనిపిస్తోంది.పవన్ గాజు గ్లాసు వైసీపీని ఎలా అయితే చీలుస్తుందో.. కూటమిని కూడా అదే విధంగా బాధ పెడుతోంది. గాజు గ్లాసు గుర్తును ఈసీ ఫ్రీ సింబల్ జాబితాలో పెట్టడం అటు జనసేనతో పాటు ఇటు కూటమి పార్టీలకు కూడా ఎదురు దెబ్బగానే భావించాలి. ఒక విధంగా చెప్పాలంటే ఇది గెలుపు ఓటములను నిర్దేశిస్తుంది అనడం ఎటువంటి అతిశయోక్తి కాదు.
అయితే జనసేన కొంతవరకు సేఫ్ జోన్ లోకి వెళ్ళింది. న్యాయస్థానం కొంత ఊరట ఇచ్చింది. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. మచిలీపట్నం, కాకినాడ పార్లమెంటు స్థానాల్లో జనసేన బరిలో ఉంది. ఈ రెండు ఎంపీ స్థానాల పరిధిలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరికి గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమంటూ ఈసీ న్యాయస్థానానికి వివరణ ఇచ్చింది. దీంతో జనసేనకు పాక్షిక ఊరడింపు లభించింది. అయితే ఇది కూటమి గెలుపునకు ప్రమాదకరమే.జనసేన పోటీ చేస్తున్న రెండు పార్లమెంటు స్థానాల్లో మాత్రమే గాజు గ్లాసు గుర్తు కేటాయించరు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ లకు గాజు గ్లాసు గుర్తు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. కూటమి పార్టీల మధ్య ఓట్లు చిలే ప్రమాదం పొంచి ఉంది. ప్రతి ఓటు కీలకంగా ఉన్న ప్రస్తుత తరుణంలో.. గాజు గ్లాస్ గుర్తు చీల్చే ఓటు చేటు తెస్తుంది.
అయితే ఇప్పటివరకు జనసేన పరంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇకనుంచి కూటమిపరంగా న్యాయపోరాటం చేసే ఛాన్స్ కనిపిస్తోంది. దీనిపై పిటిషన్ వేయాలని టిడిపి భావిస్తోంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి భాగస్వామ్య పార్టీ అయినందున.. ఆ పార్టీ సైతం ఈసీ వద్ద ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఎన్నికలు అంటేనే నిబంధనలతో కూడుకున్న వ్యవహారం. అటువంటిది రాజకీయ లబ్ధి కోసం అధికార వైసిపి పెద్ద ఎత్తున ఇండిపెండెంట్ అభ్యర్థులను బరిలో దించింది. వారికి గాజు గ్లాసు గుర్తు వచ్చేలా చేసింది. దీనిని ఆధారాలతో నిరూపించగలిగితే ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే పవన్ చెప్పినట్టు గాజు పగిలే కొద్దీ.. పదునెక్కుతుంది అన్నమాట నిజంగానే రుజువు అవుతోంది. ఏపీ రాజకీయాలను గాజు గ్లాస్ గుర్తు షేక్ చేస్తోంది.