TDP Janasena Alliance: ఏపీలో జగన్ ను అధికారం నుంచి దూరం చేయడమే కాకుండా.. సుస్థిర ప్రభుత్వాన్ని అందించేందుకు టిడిపి, జనసేన కలిశాయి. తాము తమ రాజకీయ ప్రయోజనాల కోసం కలవలేదని.. రాష్ట్రం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అటు చంద్రబాబు, ఇటు పవన్ లు చెప్పుకొచ్చారు. పొత్తు ధర్మాన్ని ఇరు పార్టీల శ్రేణులు గౌరవించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనకు కసరత్తు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆ రెండు పార్టీల కార్యకర్తలు, కొంతమంది నాయకులు పొత్తుకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతుండడం అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తోంది. రెండు పార్టీల నాయకత్వాలను కలవరపెడుతోంది.
పొత్తు విషయంలో ఆది నుంచి పవన్ కళ్యాణ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పొత్తుకు విఘాతం కలిగించే.. చాలా రకాల చర్యలు ఉంటాయని ముందుగానే గ్రహించి పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టిడిపికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని.. చంద్రబాబు అనుభవం ఈ రాష్ట్రానికి అవసరమని.. తెలుగుదేశం క్యాడర్ ను తక్కువ చేసి చూడొద్దని సొంత పార్టీ శ్రేణులకు పవన్ స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా.. ఈ రాష్ట్ర శ్రేయస్సుకు పొత్తు అనివార్యమని.. టిడిపి తో పొత్తు ప్రకటించిన నాడే పవన్ స్పష్టం చేశారు.చాలా రకాలుగా జనసేన శ్రేణులను ప్రత్యర్థులు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నించినా.. పవన్ నిలువరిస్తూ వచ్చారు.
అటు చంద్రబాబు సైతం కష్టకాలంలో తనకు అండగా నిలిచిన పవన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జనసేనతో పొత్తు ద్వారా ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. తమ పార్టీ నేతలకు పొత్తు అవసరం ఎంత ఉందో.. అందుకు గల ఆవశ్యకతను తెలియజేశారు. జగన్ లాంటి బలమైన ప్రత్యర్థిని ఢీ కొట్టాలంటే పొత్తు అవసరం అని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. నందమూరి బాలకృష్ణ అయితే జనసేన కండువా వేసుకోవడమే కాదు.. జై తెలుగుదేశం.. జై జనసేన అంటూ నినాదాలు కూడా చేశారు.
అయితే మొన్నటి వరకు సవ్యంగా నడిచిన పొత్తు.. సీట్ల సర్దుబాటు ముందు బెడిసి కొట్టేలా ఇరు పార్టీల నేతలు వ్యవహరిస్తున్నారు. రా కదలిరా సభల్లో చంద్రబాబు మాట దొర్లారు. మండపేట, అరకు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో తనపై కూడా ఒత్తిడి ఉందని.. అందుకే అభ్యర్థులను ప్రకటిస్తున్నానని చెప్పి రిపబ్లిక్ డే నాడు రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేయబోతుంది అంటూ పవన్ స్పష్టం చేశారు. ఇదే అదునుగా రెండు పార్టీల శ్రేణులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కష్టకాలంలో పవన్ చేసిన సాయాన్ని మరిచిపోయారని జనసేన.. మీ పార్టీకి అంత సీన్ లేదని టిడిపి వివాదాన్ని మరింత జఠిలం చేస్తున్నాయి. వైసీపీని అధికారం నుంచి దూరం చేయడమే అసలైన లక్ష్యం అంటూ చెప్పిన ఇరు పార్టీల శ్రేణులు ఆ మాట మరిచిపోతున్నారు. నిన్న చంద్రబాబు సభలోనే టిడిపి శ్రేణులు గలాటా సృష్టించాయి. ఒకానొక దశలో పార్టీ శ్రేణుల దూకుడుకు చంద్రబాబు స్టేజి పైనుంచి కిందకి పడిపోయే ప్రమాదం ఏర్పడింది. భద్రతా సిబ్బంది కలుగజేసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ పరిణామం పొత్తులపై ప్రభావం చూపుతుందని రెండు పార్టీల శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. పొత్తు విషయములో అధినేతల నిర్ణయాన్ని క్యాడర్ గౌరవిస్తేనే అసలు లక్ష్యం నెరవేరుతుంది. లేకుంటే మాత్రం ప్రత్యర్థికి ఇదో వరంగా మారనుంది. ఈ విషయంలో రెండు పార్టీల అధినాయకత్వాలు సైతం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరిగ్గా సీట్ల సర్దుబాటు ముందు రచ్చ చేసుకుని ప్రత్యర్థికి అవకాశం ఇస్తే.. అంతకంటే స్వయంకృతాపం మరొకటి ఉండదు. ఇక తేల్చుకోవాల్సింది తెలుగుదేశం, జనసేన శ్రేణులే.