AP Congress: ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం ఎవరికి నష్టం? ఎవరికి లాభం? కాంగ్రెస్ పార్టీ ఎవరి ఓట్లు చీల్చుతుంది? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది.అయితే వైసిపి ఓటు బ్యాంక్ అంత కాంగ్రెస్ పార్టీ దే కనుక.. ఆ పార్టీకే ప్రథమ నష్టమని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉంది. అదే జరిగితే టిడిపి, జనసేన, బిజెపి కూటమికి సైతం నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా షర్మిల పిసిసి పగ్గాలు తీసుకున్నాక రాష్ట్ర విభజన హామీలతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిరసనగా గట్టిగానే వాయిస్ వినిపిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఉనికికి దోహదపడుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.
ముఖ్యంగా షర్మిల ప్రత్యేక హోదా పల్లవి అందుకున్నారు. సోదరుడు జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే షర్మిల ద్వారా ఎదురయ్యే నష్టాన్ని జగన్ ముందే అంచనా వేయగలిగారు. అందుకే సొంత చెల్లి అని చూడకుండా మంత్రులు, ఎమ్మెల్యేలతో ఎదురు దాడి చేయిస్తున్నారు. ఆమెను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆమెపై మోతాదుకు మించి విమర్శలు చేస్తే అది అంతిమంగా వైసీపీకే నష్టం చేకూరుస్తుంది. అయితే షర్మిల విమర్శలపై స్పందించకుంటే మాత్రం విపరీతంగా నష్టం జరుగుతుందని వైసిపి భయపడుతోంది. అయితే వైసిపి పై విమర్శలను పోల్చుకుంటే ఆమె టిడిపి పై చేసేవి తక్కువే. తెలంగాణలో ఎన్నికలకు దూరంగా ఉండటం ద్వారా కాంగ్రెస్ పార్టీకి టిడిపి మేలు చేసింది. అందులో భాగంగా ఏపీలో టీడీపీకి మేలు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రస్తుతం టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ముందుకు వెళుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సైతం పట్టు బిగిస్తోంది. విభజన హామీలతో పాటు రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై పోరాటం చేయడం ప్రారంభించింది. పొరుగున అధికారంలో ఉన్న తెలంగాణతో పాటు కర్ణాటక నుంచి కాంగ్రెస్ నాయకత్వాన్ని తెప్పిస్తోంది. ఇక్కడ జరగబోయే నిరసన కార్యక్రమాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరు కానున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పెంచుకుంటే ప్రధానంగా వైసీపీకి నష్టం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చితే టిడిపికి నష్టం. అందుకే షర్మిల విషయంలో టిడిపి మేల్కొనకుంటే నష్టం తప్పదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే టిడిపి నాయకత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.