Chandrababu
Chandrababu: ‘పదవిలేని పొలిటీషియన్ అంటే మొగుడు లేని ఆడదానితో సమానం’ అతడు సినిమాలో షియాజీ షిండే చెప్పే డైలాగ్ ఏది. అయితే నేటి రాజకీయాలకు ఈ డైలాగ్ సింక్ అవుతుంది. దేశంలో సీనియర్ మోస్ట్ లీడర్లలో చంద్రబాబు ఒకరు. అటువంటి నాయకుడే ఇప్పుడు బిజెపి కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఆయన సీనియార్టీని కూడా చూడకుండా పొత్తుల కోసం రోజుల తరబడి ఢిల్లీలో ఉంచడానికి టిడిపి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఉత్తరాదిన చిన్నచిన్న పార్టీలతో బిజెపి పొత్తు శరవేగంగా కుదిరిన సంగతి తెలిసిందే. కానీ చంద్రబాబు విషయంలో బిజెపి ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్టు అనుమానాలు సగటు టిడిపి అభిమాని లో ఉన్నాయి.
ప్రధాని మోడీ కంటే చంద్రబాబు సీనియర్. ఆయన కంటే ముందుగానే ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్డీఏ సారధ్య బాధ్యతలు కూడా చూశారు. అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీలతో కలిసి పని చేశారు. అటువంటి నాయకుడు బిజెపి కోసం ఇప్పుడు చేతులు కట్టుకొని ఢిల్లీలో నిలబడటం మాత్రం సగటు టిడిపి అభిమాని జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు రోజులుగా చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. పవన్ తో పాటు బిజెపి అగ్ర నేతలను కలుస్తున్నారు. కానీ పొత్తుల అంశం ఒక కొలిక్కి రావడం లేదు. కనీసం 48 గంటలు గడుస్తున్నా బీజేపీ అగ్ర నేతలు స్పందిస్తున్న తీరు మాత్రం అనుమానాస్పదంగా ఉంది. అవమానించేలా ఉందని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. ఢిల్లీలో సాగుతున్న పొత్తు జాప్యం పై టిడిపి నాయకులు, కార్యకర్తలు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు.
నాలుగు దశాబ్దాల పైబడి రాజకీయం అనుభవం కలిగిన చంద్రబాబు తనను తాను తగ్గించుకొని పొత్తు కోసం ఢిల్లీ వెళ్లారు. పూర్వాశ్రమంలో తమ కూటమిలో పని చేశారన్న కనీస శ్రద్ధ లేకుండా బిజెపి అగ్ర నేతలు వ్యవహరిస్తున్నారని టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. పొత్తు వద్దనుకుంటే చెప్పేయాలి కానీ.. ఇలా పిలిచి అవమానించడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. రోజుల తరబడి కాపలాకాచేలా బిజెపి పెద్దలు వ్యవహరించడానికి తప్పు పడుతున్నాయి. ఎన్నికలకు ఏ క్షణమైనా షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశం ఉంది. అది బిజెపి నేతలకు సైతం తెలుసు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఎన్నికల ప్రచార సభలను సైతం నిర్వహిస్తోంది. కానీ పొత్తు కోసం ఢిల్లీ పిలిపించి చంద్రబాబును కాపలా కాచేలా వ్యవహరించడం మాత్రం టిడిపి శ్రేణులు సహించలేకపోతున్నాయి. వాస్తవానికి బిజెపితో పొత్తు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఇష్టం లేదు. కానీ బలమైన జగన్ ఎదుర్కోవాలంటే వ్యవస్థలపరంగా బలం అవసరం. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే కేంద్రం దన్ను కీలకం. అందుకే చంద్రబాబు విలువైన సీట్లు వదులుకునేందుకు సైతం ముందుకొస్తున్నారు. కానీ ఎటూ తేల్చక బిజెపి అవమానిస్తుండడానికి చూసి మాత్రం టిడిపి నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఈ వయసులో చంద్రబాబుకు అది అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.