Glass Symbol: గాజు గ్లాసు ఎవరిదంటే?24 గంటల్లో ఈసీ సంచలన నిర్ణయం

వాస్తవానికి ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాస్ గుర్తును.. జనసేన కామన్ సింబల్ గుర్తుగా కేటాయించాలని ఆ పార్టీ రెండుసార్లు ఎలక్షన్ కమిషన్కు విన్నవించింది.

Written By: Dharma, Updated On : April 30, 2024 3:25 pm

Glass Symbol

Follow us on

Glass Symbol: ఏపీ రాజకీయాల్లో కీలక ట్విస్ట్. జనసేన పోటీలో లేనిచోట్ల ఆ పార్టీ గుర్తు గాజు గ్లాసును ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ జనసేన హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. ఎన్డీఏ ఓట్లు చీల్చడానికి కుట్ర జరుగుతోందని.. అందులో భాగంగానే జనసేన గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చారని జనసేన తరపు న్యాయవాది వాదించారు. దీనిపై 24 గంటల్లో ఈసీ నిర్ణయం తీసుకుంటుందని ఎలక్షన్ కమిషన్ తరుపు న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు. దీంతో గుర్తు కేటాయింపు అంశం యూ టర్న్ తీసుకుంది.

వాస్తవానికి ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాస్ గుర్తును.. జనసేన కామన్ సింబల్ గుర్తుగా కేటాయించాలని ఆ పార్టీ రెండుసార్లు ఎలక్షన్ కమిషన్కు విన్నవించింది. కానీ ఈసీ నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. నిన్న దీనిపై ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎక్కడా అమలు కాలేదు. అయితే నిన్న నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత.. పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ లకు గాజు గ్లాస్ గుర్తు దక్కింది. అయితే ఇందులో టిడిపి విజయ అవకాశాలు ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే ఈ గుర్తు కేటాయించడం వ్యూహంగా తెలుస్తోంది. దీంతో కూటమి అభ్యర్థుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తోంది. అక్కడ ఆ పార్టీ అభ్యర్థులకే గాజు గ్లాసు గుర్తు దక్కనుంది. మిగతా చోట్ల మాత్రం ఇండిపెండెంట్ లకు దక్కే ఛాన్స్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాస్ గుర్తును కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఇదే మాదిరిగా గాజు గ్లాస్ గుర్తును ఇండిపెండెంట్లు దక్కించుకున్నారు. వేల ఓట్లు సాధించుకున్నారు. ఏపీలో కూటమిని దెబ్బతీయాలని అధికార పార్టీ యోచిస్తోంది. అయితే దీనిపై ముందస్తు సమాచారం ఉందో? లేకుంటే జనసేన జాగ్రత్త తీసుకోలేదో? తెలియదు కానీ.. ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న వైసీపీ సానుభూతిపరులకే గాజు గ్లాసు గుర్తు దక్కడం విశేషం.

అయితే ఈసీ నిర్ణయంపై జనసేన ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాస్ గుర్తును.. కామన్ సింబల్గా కేటాయించాలని రెండుసార్లు విన్నగించినట్లుజనసేన తరపు వాదనలు వినిపించిన న్యాయవాది పేర్కొన్నారు.ఇప్పటికే జనసేన కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకున్న నేపథ్యంలో.. ఇది రాజకీయంగా నష్టం చేకూరుస్తుందని ఆయన వాదించారు. దీనిపై ఈసీ తరపు న్యాయవాది స్పందించారు. ఈ అంశం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉందని.. 24 గంటల వ్యవధిలో ఈసీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. దీంతో కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది కోర్టు. జనసేన కామన్ సింబల్ విషయంలో న్యాయస్థానం తీర్పు ఎలా ఉన్న సంచలనమే.