2024 Winner : ఏపీలో ఇప్పుడు కాపులు డిసైడింగ్ ఫ్యాక్టర్స్. వారు ఎటువైపు మొగ్గుచూపితే ఆ పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశముంది. 2014లో చంద్రబాబును, 2019లో జగన్ ను సీఎం చేయడంలో కాపులదే యాక్టివ్ రోల్. అందుకే ఈసారి కాపుల మద్దతు కోసం అన్ని పార్టీలు పోటీపడుతున్నాయి. కానీ కాపులు మాత్రం జనసేన వైపు చూస్తున్నారు. పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే గుంపగుత్తిగా ఓట్లు వేస్తామని శపధం చేస్తున్నారు. ఇక్కడే పవన్ తన నిజాయితీని చాటుకున్నారు. తాను సీఎం క్యాండిడేట్ ను ఎలా అవుతానని ప్రశ్నించారు. 2019లో స్వయంగా తననే ఓడించినప్పుడు తాను ఎలా సీఎం పోస్టు కోసం పట్టుబడగలనని ప్రశ్నించడం ద్వారా కాపులను అంతర్మథనంలో పెట్టేశారు.
సీఎం పోస్టు డిమాండ్ చేస్తే రాదని.. సొంతంగా పోరాటం చేయాల్సి ఉంటుందంటున్న పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఎక్కువ మంది కాపులు పవన్ వైపు టర్న్ అయ్యారు. ముందుగా ఆయనకు సంఖ్యాబలం ఇవ్వాలని డిసైడయ్యారు. అయితే అది పవన్ వరకేనా? లేకుంటే పవన్ మద్దతిచ్చే టీడీపీకి కూడానా? అన్నది తేలాల్సి ఉంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రాలో దక్షిణ కోస్తాలో కాపులు ప్రభావితం చేసే సీట్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. పవన్ నిజాయితీగా ముందుకెళుతున్న క్రమంలో జనసేన, టీడీపీకి కాపులు జైకొట్టే అవకాశముంది.
వాస్తవానికి కాపుల మద్దతు టీడీపీకి కూడా ఉంది. మెజార్టీ కాపు నాయకులు ఆ పార్టీలో కొనసాగుతున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు కాపులకు ఈబీసీ నేస్తం, ఈబీసీ రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసి నిధులు సైతం కేటాయించారు. కాపు నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. గత ఎన్నికల్లో జగన్ మాటలను నమ్మి కాపులు ఆయనకు జైకొట్టారు. కానీ కాపులకు ప్రత్యేకంగా ఒనగూరిన ప్రయోజనాలేవీ లేవు. దీంతో వారు చంద్రబాబే నయమన్న నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు పవన్ చంద్రబాబుతో కలుస్తుండడంతో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కాపులు దాదాపు వైసీపీకి దూరమైనట్టే. కాపుల లోటును వేరే వర్గాల ద్వారా భర్తీ చేసుకోవాలని జగన్ చూస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులకు దీటుగా అదే సామాజికవర్గానికి చెందిన నేతలను బరిలో దించాలని చూస్తున్నారు. మరోవైపు కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభంను తన వైపు తిప్పుకోవాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుకు అధికంగా నిధులు రప్పించి గోదావరి జిల్లాల ప్రజలను ఆకర్షించాలని కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ అవన్నీ ఎంతవరకూ వర్కవుట్ అవుతాయో చూడాలి మరీ.