YCP Rajyasabha Members : ఏపీలో కీలక రాజకీయ పరిణామం. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున రాజ్యసభ సభ్యులు కూటమి పార్టీలో చేరబోతున్నారని టాక్ నడుస్తోంది. సెప్టెంబర్ నెలలో ఈ చేరికలు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. పార్టీ అధినేత లండన్ పర్యటనకు వెళ్ళనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు జగన్ విదేశీ పర్యటనలో ఉంటారు. ఆ సమయంలోనే రాజ్యసభ సభ్యులు పార్టీ మారేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.వైసిపికి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు.ఏపీ నుంచి ఇతర పార్టీలకు ప్రాతినిధ్యం లేదు.ముఖ్యంగా టిడిపికి రాజ్యసభ సభ్యుల బలం లేదు. అందుకే ఆ పార్టీ రాజ్యసభ సభ్యులపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వైసీపీలో ఒకే ఒక్క రాజ్యసభ సభ్యుడు మిగులుతారని.. మిగతా వారంతా పార్టీ మారడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని. కూటమి పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో రాజ్యసభ సభ్యులు వైసీపీని వీడేందుకు సిద్ధపడ్డారని సమాచారం. అదే జరిగితే వైసీపీకి ఇబ్బందికర పరిణామాలు దాపురించినట్టే. అయితే పార్టీ నుంచి ఏ ఒక్క రాజ్యసభ సభ్యుడు బయటకు వెళ్లడని వైసీపీ హై కమాండ్ భావించింది. ఈ తరుణంలో వైసిపి హై కమాండ్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.
* మోపిదేవి నేతృత్వంలో
ప్రధానంగా మోపిదేవి వెంకటరమణ గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల్లో రేపల్లె అసెంబ్లీ టికెట్ ఆశించారు. కానీ జగన్ ఇవ్వలేదు. అప్పటినుంచి ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబుతో చర్చలు జరిపారని.. మోపిదేవి కుమారుడు రాజకీయ భవిష్యత్తుకు చంద్రబాబు హామీ ఇచ్చారని.. అందుకే ఆయన టిడిపిలో చేరిపోతారని తెలుస్తోంది. ఆయనతో పాటు గొల్ల బాబురావు, బీదా మస్తాన్ రావు పేరు వినిపిస్తోంది. ఈ ముగ్గురు టిడిపిలో చేరతారని టాక్.
* బిజెపిలోకి ఐదుగురు
మరోవైపు బిజెపిలోకి ఐదుగురు రాజ్యసభ సభ్యులు వెళ్తారని తెలుస్తోంది. రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పరిమల్ నత్వాని తో పాటు మరొకరు బిజెపిలో చేరతారని తెలుస్తోంది. బిజెపి హై కమాండ్ సానుకూలత వ్యక్తం చేయడంతో వీరు ఆ పార్టీలో చేరడం ఖాయమని సమాచారం. జనసేనలోకి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్ కృష్ణయ్య చేరేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఈ తరుణంలో వైసీపీలో ఒక్కరే మిగులుతారని తెలుస్తోంది.
* ఆ ఇద్దరిలో ఎవరు మిగులుతారు
వైసీపీలో నమ్మకస్తులైన రాజ్యసభ సభ్యులు జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఇద్దరూ జగన్ కు కావలసిన వారే. ఇప్పుడు వీర విధేయత విషయంలో ఆ ఇద్దరిపై అనుమానాలు ఉన్నాయి. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు పార్టీని వీడిన జగన్ పై ప్రభావం తప్పకుండా చూస్తారు. జగన్ ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అయితే జగన్ విదేశీ పర్యటనలో ఉండగా.. వీలైనంతవరకు పార్టీలో సంక్షోభం తెచ్చేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యులే కాదు ఎమ్మెల్సీలు సైతం పార్టీ మారుతారని సంకేతాలు వస్తుండడంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.