https://oktelugu.com/

TTD Laddu Issue : సుప్రీం’ ప్రత్యేక సిట్ ఎవరికి మేలు? స్వాగతిస్తున్నా లోలోపల గుబులు

తిరుమల లడ్డు వివాదం పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీనికి ఒక పరిష్కార మార్గం చూపించాలని ఆశించింది. ప్రత్యేక సిట్ ఏర్పాటుకు ఆదేశించింది. అయితే ఇది ఎవరికి మేలు అన్న చర్చ ప్రారంభం అయ్యింది.

Written By:
  • Dharma
  • , Updated On : October 5, 2024 / 02:13 PM IST

    TTD Laddu Issue

    Follow us on

    TTD Laddu Issue :  తిరుపతి లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు ఆదేశాలు సరికొత్తగా ఉన్నాయి. ఇప్పటికే ఈ వివాదం పై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీనిపై సంతృప్తి చెందని వైసిపి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని కోరింది. ఆరోపణలు చేసిన సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్.. ఆయనకు అనుకూలంగా నివేదిక ఇస్తుందన్నది వైసీపీ అనుమానం.దీనిపై ఏకీభవించిన సుప్రీంకోర్టు చంద్రబాబు కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి..పూర్తి ఆధారాలు లేకుండా, సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పట్టింది. దీంతో వెనువెంటనే చంద్రబాబు సైతం సిట్ విచారణను నిలిపివేయించారు. దీంతో తాము కోర్టుకు ఆశ్రయించడం వల్లే చంద్రబాబు సిట్ విచారణను నిలిపి వేయించారని వైసీపీ గొప్పగా చెప్పుకుంది. సుప్రీంకోర్టు తప్పకుండా సిబిఐతో విచారణ చేయిస్తుందని బలంగా నమ్మింది. కానీ కోర్టు అనూహ్యంగా.. మధ్యేమార్గంగా కేంద్రంలోని సిబిఐతో పాటు రాష్ట్ర పోలీస్ శాఖకు విచారణ బాధ్యతలు అప్పగించింది. సిబిఐ తరుపున ఇద్దరు, రాష్ట్ర పోలీస్ శాఖ తరపున ఇద్దరు, ఆహార కల్తీ నియంత్రణ శాఖ నుంచి ఒక అధికారిని నియమించి.. విచారణ చేయించాలని ఆదేశించింది కోర్టు. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని కూడా స్పష్టం చేసింది. కోట్లాదిమంది మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం.

    * చంద్రబాబుకి ఎక్కువ అనుకూలం
    అయితే సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఏ పార్టీకి అనుకూలం అన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. సుప్రీం ఇచ్చిన తీర్పును సీఎం చంద్రబాబు తో పాటు వైసీపీ నేతలు కూడా స్వాగతిస్తున్నారు. సత్యమేవ జయతే అని చంద్రబాబు అంటుంటే.. సుప్రీం ఆర్డర్స్ చంద్రబాబుకు చంప పెట్టు లాంటివని.. తప్పకుండా న్యాయం జరుగుతుందని మాజీ సీఎం జగన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది చాలావరకు చంద్రబాబుకు అనుకూలంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదో ఒక కేంద్ర పరిధిలోని సంస్థ తో విచారణ జరగాలని చంద్రబాబు కోరుకున్నారని.. ఇప్పుడు జరుగుతున్నది అదేనని విశ్లేషిస్తున్నారు.

    * రెండు రకాలుగా విమర్శలు
    ఏపీ సర్కార్ వేసిన సిట్ నెయ్యి కల్తీ జరిగిందని నిర్ధారించినా చంద్రబాబు విమర్శలు ఎదుర్కోవాలి. కల్తీ జరగలేదని చెప్పినా అది చంద్రబాబుకు మైనస్. సొంతంగా ఏర్పాటు చేసిన టీం అంతకంటే ఏం నిర్ధారిస్తుందిలే అని వైసిపి నుంచి విమర్శలు వచ్చేవి. కానీ ఇప్పుడు అటువంటి విమర్శలు ఏవి ఎదురయ్యే అవకాశం లేదు. వైసీపీ సైతం ఈ ప్రత్యేక సిట్ ను ఆహ్వానించడంతో.. ఆ టీం ఇచ్చే నివేదికను ఒప్పుకోవాల్సిన అనివార్య పరిస్థితి. ఆ నివేదిక వచ్చేవరకు సైలెంట్ గా ఉండాల్సిందే.

    * వైసీపీలో తగ్గిన ఆందోళన
    అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పటివరకు వైసీపీ కార్నర్ అవుతూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంతో ఒక రకమైన ఆందోళన ఆ పార్టీలో కనిపించింది. ఇప్పటికే అనేక రకాలైన ఇబ్బందుల్లో ఉంది ఆ పార్టీ. ఈ వివాదం జరిగిన తర్వాత ఆత్మ రక్షణలో పడింది. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అత్యున్నత న్యాయస్థానం చంద్రబాబు వైఖరిని తప్పు పట్టేసరికి ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక సిట్ ఏర్పాటు కావడం, దీనిపై బహిరంగంగా మాట్లాడొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలతో.. ఈ విషయం నుంచి తాత్కాలికంగా బయటపడినట్లు అయిందని వైసిపి భావిస్తోంది. మొత్తానికి అయితే ప్రత్యేక సిట్ ఏర్పాటుతో.. అటు టిడిపిలో, ఇటు వైసీపీలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.