Nominated posts : చంద్రబాబు మదిలో ఉన్న ఆ ‘ఎనిమిది మంది’ ఎవరు

ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే ఐవీఆర్ఎస్ పద్ధతిలో నేతల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ చీఫ్ విప్, విప్ పదవుల భక్తిపై దృష్టి పెట్టారు చంద్రబాబు.ఈరోజు అధికారికంగా ప్రకటన చేయనున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Written By: Dharma, Updated On : July 24, 2024 11:55 am
Follow us on

Nominated posts  : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. పాలనలో తన మార్కు చూపిస్తోంది.మరోవైపు సంక్షేమ పథకాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పింఛన్లను పెంచి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేంద్రం సైతం బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది.మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు సైతంతమ వంతు సహకారం అందిస్తామని ప్రకటించింది. ఇప్పటికే 50 రోజుల పాలన సమీపిస్తుంది. చంద్రబాబు చాలా రకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే విప్పులను కూడా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీఫ్ విప్ తో పాటు ఏడుగురు విప్ లను నియమించాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు దీనిపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. జనసేన పార్టీ తరఫున ఒక బీసీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు విప్ పదవి ఇవ్వాలని చంద్రబాబు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

* పదవుల పంపకం తప్పనిసరి
ఏపీలో మూడు పార్టీలు కలిపి కూటమి కట్టాయి. ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సుదీర్ఘకాలం ఈ పొత్తు కొనసాగాలని మూడు పార్టీలు కోరుకుంటున్నాయి. ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినందున.. నామినేటెడ్ పదవులతో పాటు ఇతర అంశాల్లో మూడు పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగా చీఫ్ విప్ తో పాటు ఏడుగురు విప్ లను.. మూడు పార్టీల నుంచి ఎంపిక చేయనున్నట్లు సమాచారం. బిజెపి కి సంబంధించి విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును విప్ గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టిడిపి నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు, ఒక బీసీ, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించినట్లు సమాచారం. ప్రభుత్వ చీఫ్ విప్ ప్రకటన కూడా ఈరోజు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. చీఫ్ విప్ రేసులో టిడిపి నేతలు బీటీ నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, జీవి ఆంజనేయుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఒకరికి ఛాన్స్ దక్కొచ్చని తెలుస్తోంది. అయితే జనసేనతో పాటు బిజెపి సైతం చీఫ్ విప్ పదవి కోరుతున్నా.. టిడిపి మాత్రం విడిచి పెట్టే ఛాన్స్ కనిపించడం లేదు.

* పరిశీలనలో ఆ ముగ్గురి పేర్లు
అయితే శాసనమండలి నుంచి చీఫ్ విప్ ను ఎంపిక చేస్తే.. బీటీ నాయుడు పేరు ప్రతిపాదనలోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం బీటీ నాయుడు కర్నూలు టిడిపి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర మంత్రి పదవి ఆశించారు. పొన్నూరు నుంచి టిడిపి ఎమ్మెల్యేగా ఆరోసారి గెలిచారు. 1994లో తొలిసారిగా పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అప్పటినుంచి 2014 వరకు వరుసగా ఐదు సార్లు గెలుస్తూ వచ్చారు. 2019లో మాత్రం కిలారి వెంకట రోశయ్య చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో అంబటి మురళీకృష్ణ పై 32 వేల మెజారిటీతో గెలిచారు. మంత్రి పదవి ఆశించారు. కానీ వివిధ సమీకరణల నేపథ్యంలో ఆయనకు పదవి దక్కలేదు.

* రేసులో ఆంజనేయులు
టిడిపి సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సైతం చీఫ్ విప్ పదవి ఆశిస్తున్నారు. వినుకొండ నుంచి టిడిపి తరఫున ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో టిడిపి తరఫున తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2014 లోను విజయం సాధించారు. 2019లో మాత్రం ఓడిపోయారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే మంత్రి పదవి ఆశించిన ఆంజనేయులకు ఛాన్స్ దక్కలేదు. కనీసం చీఫ్ విప్ పదవి ఇవ్వాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరినట్లు సమాచారం. ఈ ముగ్గురిలోఒకరికి పదవి ఖాయమన్నట్లు ప్రచారం జరుగుతోంది.

* విపక్ష పార్టీ లేని సమయంలో
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ జగన్ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు. మరోవైపు కీలక బిల్లులు శాసనసభలో ఆమోదం పొందుతున్నాయి. ఈ తరుణంలో చీఫ్ వీప్ తో పాటు ఏడు విప్ పదవులను భర్తీ చేయనున్నారు. అయితే ఓటమి అభ్యర్థులు 164 మంది ఎన్నికైన నేపథ్యంలో పదవులకు విపరీతంగా పోటీ ఉంది. మరి చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.