Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టిడిపి, జనసేన సంయుక్తంగా శనివారం అభ్యర్థులను ప్రకటించాయి. 94 స్థానాలకు టిడిపి, ఐదు స్థానాలకు జనసేన అభ్యర్థుల పేర్లను వెల్లడించాయి. ఈ నేపథ్యంలో టిడిపి అధినేత కుప్పం నుంచి పోటీ చేస్తానని ప్రకటించగా.. జనసేన అధినేత ఎక్కడి నుంచి పోటీ చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆయన పోటికి సంబంధించి అయోమయం నెలకొంది. గత ఎన్నికల్లో ఆయన గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ ఆయన ఓటమి పాలయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ అభ్యర్థులు 130 స్థానాల్లో పోటీ చేశారు. కేవలం ఒక్క స్థానంలో మాత్రమే ఆయన పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో జనసేన సొంతంగా కాకుండా టిడిపి తో పొత్తు కుదుర్చుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేలాగా ఒప్పందం కుదిరింది.
శనివారం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. వాస్తవానికి 118 స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారు చేసామని మొదట చెప్పినప్పటికీ.. తర్వాత అది కేవలం 99 స్థానాల వరకే పరిమితమైంది. 94 స్థానాలలో టిడిపి.. ఐదు స్థానాలలో జనసేన అభ్యర్థులను ప్రకటించారు. మిగతా అభ్యర్థులను తర్వాతి జాబితాలో ప్రకటిస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానంలో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్.. ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. అందులో భాగంగానే ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే కాకినాడ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇందుకు సంకేతంగానే కాకినాడ నియోజకవర్గం లో ఇటీవల పవన్ కళ్యాణ్ పలుమార్లు పర్యటించారు. డివిజన్ల భారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కాకినాడ సిటీలోని 50 డివిజన్లకు గానూ 28 డివిజన్ల పెద్దలతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. కాకినాడలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది? అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి? వాటి పరిష్కారానికి ఏం చేయాలి? అనే కోణాల్లో అక్కడ పెద్దలతో పవన్ కళ్యాణ్ మంతనాలు జరిగినట్లు తెలుస్తోంది. గత వారంలో మూడు రోజులూ పవన్ కళ్యాణ్ కాకినాడలోనే పర్యటించారు. ఇక శనివారం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కాకినాడ గురించి చంద్రబాబు నాయుడు ప్రస్తావించలేదు..