WhatsApp Governance: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా పాలనలో వినూత్న మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. పాలనను మరింత సరళతరం, సులభతరం చేయాలని చూస్తోంది. అందులో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ ను మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది. సేవలను విస్తరించాలని చూస్తోంది. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ అమల్లోకి వచ్చింది. 100కు పైగా సేవలు అందుతున్నాయి. ఇప్పుడు మరో 500 సేవలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన పెంచాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు.
* ఈసారి ప్రత్యేక విజన్ తో
చంద్రబాబు ( Chandrababu)ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఒక విజన్ తో ముందుకు వెళ్తారు. అప్పట్లో విజన్ 20 20 అని చెప్పుకొచ్చారు. ఈసారి మాత్రం విజన్ 2040 అంటూ కొత్త లక్ష్యం పెట్టుకున్నారు. గతసారి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) కి ప్రాధాన్యమిచ్చారు. ఈసారి మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఈ) కొత్త నినాదం ఇస్తున్నారు. డ్రోన్ల రంగానికి అత్యంత ప్రియారిటి కల్పిస్తున్నారు. అదే క్రమంలో ప్రజలకు సులభతరంగా పాలన వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించి మెటా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది. ప్రజలకు క్షణాల్లో సేవలను, ప్రభుత్వ ధ్రువపత్రాలను అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ఎంతగానో దోహదపడనుంది.
* సీఎం చంద్రబాబు సమీక్ష
తాజాగా సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల యంత్రాంగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వాట్సాప్ గవర్నెన్స్( WhatsApp governance ) ద్వారా 500 సేవలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందుకే అన్ని కలెక్టరేట్లలో వాట్సాప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ అంశంపై ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో చెప్పకనే చెప్పారు చంద్రబాబు. ఇప్పటికీ ఆన్లైన్ సేవల విషయంలో ప్రజల్లో ఆశించిన స్థాయిలో అవగాహన లేదు. వాట్సాప్ గవర్నెన్స్ పై సైతం జిల్లా స్థాయిలో ఎక్కడ అవగాహన కార్యక్రమాలు ప్రారంభం కాలేదు. అందుకే సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అన్ని జిల్లా కలెక్టరేట్లలో వాట్సాప్ గవర్నెన్స్ కు సంబంధించి ప్రత్యేక సెల్ అందుబాటులోకి రానున్నాయి.
* క్యూఆర్ కోడ్లు అందుబాటులో..
మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలతో( government offices) పాటు రైతు బజార్లలో క్యూఆర్ కోడ్ ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పుడే పారదర్శక సేవలతో పాటు నిత్యవసర ధరలు అందుబాటులో ఉంటాయని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల కు సంబంధించి సమాచారం, సేవ రుసుం వంటి వాటి వివరాలు ప్రజలకు తెలియడం లేదు. రైతు బజార్లలో సైతం నిత్యవసరాల ధరలు తెలియడం లేదు. తద్వారా అక్కడ అవినీతి జరుగుతోందని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. అందుకే క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.