AP Alliance Government: ప్రభుత్వాలు అన్నింటికీ సమప్రా ధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా సంక్షేమంతో( welfare) పాటు అభివృద్ధి పనులు చేయాలి. అప్పుడే ప్రజలు ఒక స్థిర నిర్ణయానికి వస్తారు. జగన్ హయాంలో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేశారు. ప్రతి ఇంటికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ప్రజలు మాత్రం అభివృద్ధిని కోరుకున్నారు. సంక్షేమ పథకాల్లో కొన్ని అవసరం లేనివి కూడా జగన్ అమలు చేశారు. వాటిపైనే ఎక్కువగా వ్యతిరేకత వచ్చింది. అభివృద్ధి లేకపోవడం, విపరీతమైన సంక్షేమాన్ని అమలు చేయడం వంటి కారణాలతో వైసీపీని ఏపీ ప్రజలు పక్కన పెట్టారు. అయితే తాము అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. వాటినే తమ మేనిఫెస్టోగా చెప్పుకున్నారు. కానీ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఒక్క పింఛన్ పథకాన్ని మాత్రమే అమలు చేసి చూపించారు. మిగతా వాటి పరిస్థితి ఏంటి అన్నది తెలియడం లేదు. సరిగ్గా ఇప్పుడు ఆర్థికంగా రాష్ట్రం పరిస్థితి బాగాలేదని చెప్పి.. ఇప్పుడప్పుడే సూపర్ సిక్స్ హామీలు అమలయ్యే ఛాన్స్ లేదని సంకేతాలు ఇచ్చారు చంద్రబాబు.
* పూర్తిస్థాయి సంక్షేమ పథకాలు అమలు
2019లో జగన్( Jagan Mohan Reddy) నవరత్నాలను ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే సమయానుకూలంగా పథకాలను అందించగలిగారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమ పథకాల మొత్తాన్ని వేయగలిగారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో సైతం పథకాలను అమలు చేసి ప్రజలకు చేరువయ్యారు. వాలంటీర్ వ్యవస్థతో సరైన సేవలను అందించగలిగారు. అయితే ప్రజలు మితిమీరిన సంక్షేమాన్ని హర్షించలేదు. పైగా పథకాల పేరు చెప్పి రాజ్యాంగబద్ధ రాయితీలు, ఇతరత్రా పథకాలకు మంగళం పలకడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపింది.
* నవరత్నాలను చేసి చూపించారు
అయితే జగన్( Jagan Mohan Reddy) విషయంలో ఒకటి మాత్రం నిజం. 2019 ఎన్నికల్లో నవరత్నాలను ప్రకటించారు. వాటితో పాటు అదనంగా చాలా వరకు సంక్షేమ పథకాలను అమలు చేయగలిగారు. అయితే అందులో చాలా వరకు అనవసర పథకాలు ఉన్నాయన్న విమర్శ ఉంది. అయినా సరే జగన్ సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది. ఇంతవరకు సూపర్ సిక్స్ పథకాల్లో పేరు మోసిన.. ఒక్క స్కీం కూడా ప్రారంభం కాలేదు. దీంతో ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే తమలో ఉన్న అసంతృప్తిని బయటపెడుతున్నారు.
* కూటమి ప్రభుత్వానికి మైనస్ తప్పదా
కూటమి( Alliance ) ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు తప్పకుండా మైనస్ చేస్తాయని అప్పుడే విశ్లేషణలు ప్రారంభం అయ్యాయి. జగన్ విచ్చలవిడిగా సంక్షేమాన్ని అమలు చేయగలిగారు. అయితే దాని వెనుక అప్పులు చేశారో.. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టారో అన్నది అనవసరం. కానీ ప్రజలకు మాత్రం సంక్షేమ పథకాలు అందాయి. అయితే ఐదేళ్లపాటు ఈ పథకాలు నిరంతరాయంగా కొనసాగాయి. కానీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు అవుతుంది. మరో నాలుగు నెలల్లో ఏడాది పూర్తవుతుంది. అయినా సరే సంక్షేమ పథకాలు పట్టాలెక్కడం లేదు. ఇది తప్పకుండా కూటమి ప్రభుత్వంపై ప్రభావం చూపుతోందని.. ప్రజల్లో అసంతృప్తి తప్పకుండా వ్యక్తం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.