YS Jagan Tirumala Tour : తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో ఈరోజు జగన్ తిరుపతి వెళ్ళనున్నారు. ఈరోజు సాయంత్రం తిరుమల చేరుకోనున్నారు. రేపు ఉదయం స్వామి వారిని దర్శించుకోనున్నారు. తిరుపతి పవిత్రతను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించిందని.. రాజకీయాల కోసం లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చిందని వైసీపీ ఆరోపిస్తోంది. అందుకే స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలకు జగన్ నిర్ణయించారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు జరపాలని హై కమాండ్ పిలుపు ఇచ్చింది. అయితే జగన్ తిరుమల వెళ్లే క్రమంలో కీలకమైన డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. తిరుపతికి అన్యమతస్తులు వచ్చినప్పుడు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలి. ఇది పక్కా నిబంధన కూడా. అయితే అన్యమతస్తుడైన జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో అప్పట్లో మినహాయింపు ఇచ్చినట్లు వైసిపి నేతలు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. కనీసం ప్రతిపక్ష హోదా లేదు. దీంతో తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈరోజు తిరుమల రానున్న జగన్ వద్ద టిటిడి అధికారులు భావిస్తున్నారు. ముందుగానే జగన్ బస చేసే అతిథి గృహానికి వెళ్లి డిక్లరేషన్ ఫారాన్ని అందించనున్నట్లు తెలుస్తోంది. ఆయన సంతకం చేస్తే దర్శనానికి అనుమతించనున్నారు. తిరస్కరిస్తే మాత్రం దేవాదాయ శాఖ చట్ట ప్రకారం నడుచుకుంటామని టిటిడి అధికారులు చెబుతున్నారు. అంటే డిక్లరేషన్ పై సంతకం పెట్టకపోతే దర్శనానికి అనుమతించరని స్పష్టమవుతోంది.
* వైసిపి పై ఆరోపణలు
వైసీపీ హయాంలో తిరుమల లడ్డు తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యిని వినియోగించారన్నది ప్రధాన ఆరోపణ. నాటి వైసిపి ప్రభుత్వంతో పాటు అప్పటి టీటీడీ చైర్మన్లు గా ఉన్న వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిల చుట్టూ వివాదం నడుస్తోంది. ఇది ఇలా కొనసాగుతుండగానే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేందుకు జగన్ సిద్ధపడ్డారు. శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకొనున్నారు. అయితే ఇప్పుడు డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. సాధారణంగా అన్య మతస్తులు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు.. 17వ కంపార్ట్మెంట్ వద్ద డిక్లరేషన్ పై సంతకం చేయించుకుంటారు. వీఐపీలు వచ్చినప్పుడు మాత్రం అధికారులే వారు బస చేసే అతిథి గృహం వద్దకు వెళ్లి సంతకాలు తీసుకుంటారు. శుక్రవారం సాయంత్రం జగన్ తిరుమలకు రానున్న నేపథ్యంలో.. దేవాదాయ శాఖ చట్టంలోని అంశాలను ఆయనకు వివరించి డిక్లరేషన్ పై సంతకం కోరనున్నారు.
* సీఎంగా ఉండగా డిక్లరేషన్ ఇవ్వలే..
గత ఐదేళ్ల వైసిపి పాలనలో జగన్ పలుమార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు. అప్పుడు ఆయన సీఎంగా ఉండడంతో అధికారులు డిక్లరేషన్ అడిగేందుకు సాహసించలేదు. అప్పట్లో హిందూ ధార్మిక సంఘాలు, టిడిపి, జనసేన, బిజెపి నేతలు డిమాండ్ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. బ్రహ్మోత్సవాలతో పాటు వివిధ పర్వదినాల్లో వచ్చిన సమయంలో సైతం ఇదే విషయంపై ప్రతిపక్షాలు ప్రశ్నించేవి. కానీ అప్పట్లో ట్రస్ట్ బోర్డు కానీ, టిటిడి అధికారులు కానీ పట్టించుకోలేదు. ఇప్పుడుఅధికారం కోల్పోవడం, ఆయన సైతం సాధారణ ఎమ్మెల్యే కావడంతో డిక్లరేషన్ అనేది తప్పనిసరిగా మారింది.
* అది తప్పనిసరి
తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల ప్రకారం అన్యమతస్తులు శ్రీవారిని దర్శించుకునేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వడం తప్పనిసరి. తప్పనిసరిగా అఫిడవిట్ సమర్పించాలి. దేవాదాయ శాఖ చట్టం 30/1987ను అనుసరించి 1990లో అప్పటి ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది. హిందువులు కాని వ్యక్తులు, అన్య మతస్తులు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలంటే ముందుగా డిక్లరేషన్ ఫారం పై సంతకం పెట్టాలి. తాను వేరే మతానికి సంబంధించిన వ్యక్తినని… అయినా శ్రీ వేంకటేశ్వర స్వామి పై నమ్మకం, గౌరవం ఉన్నందున తనను దర్శనానికి అనుమతించాలని కోరుతూ వివరాలు పొందుపరచాలి. ఆ ఫారం పై ఖచ్చితంగా సంతకం చేయాలి. అయితే గత ఐదేళ్లుగా జగన్ ఈ పని చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు చేస్తారా? చేయరా? అన్నది తెలియాల్సి ఉంది.