YS Jagan Tirumala Tour : జగన్ తిరుమల వెళ్ళగలరా? ఆ పరిస్థితి ఉందా? ధార్మిక సంస్థలు, హిందూ సంఘాల హెచ్చరిక దేనికి సంకేతం? శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందా? మతపరమైన వివాదాలు చెలరేగే ఛాన్స్ కనిపిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో ఈరోజు మాజీ సీఎం జగన్ తిరుమల వెళ్ళనున్నారు. అయితే ఆయన మెట్ల మార్గం గుండా నడిచి వెళ్తారని ప్రచారం సాగుతోంది. అటువంటిదేమీ లేదని వైసిపి చెబుతోంది. శుక్రవారం సాయంత్రం జగన్ తిరుమల వెళ్ళనున్నారు. ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో జగన్ స్వామివారిని దర్శించుకోవడానికి వీలు లేదని స్వాములతో పాటు ధార్మిక సంఘ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే జగన్ ఇంటి చుట్టూ కాషాయ నీరు చల్లి నిరసన తెలిపారు. ఇప్పుడు తిరుమలలో జగన్ ను అడ్డుకుంటామని చెబుతున్నారు. ఆయన వాహనాల ముందు పడుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో జగన్ పర్యటన ఉంటుందా? లేదా? అన్న అనుమానాలు ఉన్నాయి.
* వైసీపీ పై హిందువుల ఆగ్రహం
లడ్డు వివాదం నేపథ్యంలో కోట్లాదిమంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వైసిపి వైఫల్యం తోనే ఇది జరిగిందన్నది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. పైగా గత ఐదేళ్లుగా టీటీడీతో పాటు హిందూ ధార్మిక సంస్థల విషయంలో జరిగిన పరిణామాలు కూడా వైసీపీని కార్నర్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా హిందూ మతానికి చెందిన స్వామీజీలు, ధార్మిక సంఘాలు వైసీపీ పై ఆగ్రహంగా ఉన్నాయి. లడ్డు తయారీ వివాదం నేపథ్యంలో వైసిపి వైఫల్యం ఉందని భావిస్తున్నాయి. అందుకే ఆ పార్టీని, అధినేత జగన్ ను తీవ్రంగా ద్వేషిస్తున్నాయి.
* గతంలోనే అనేక ఫిర్యాదులు
తిరుపతిలో అన్యమత ప్రచారం విషయంలో కూడా రకరకాల కామెంట్స్ వినిపించాయి. కానీ ఒక్కనాడు అంటే ఒక్కనాడు కూడా వైసిపి ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టలేదు. ఎంతటి వివాదానికి వైసీపీ ప్రభుత్వ చర్యలే కారణమన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. చైర్మన్లుగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఈ ఘటనను ఖండించినా హిందూ ధార్మిక సంఘాలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వైసిపి ఈ విషయంలో కార్నర్ అవుతుండడం ఆ పార్టీ శ్రేణుల్లో సైతం ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే జగన్ పర్యటన ఖరారు అయింది. ఈ సాయంత్రానికి ఆయన తిరుమల చేరుకోనున్నారు. దీంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన కనిపిస్తోంది.
* పోటా పోటీగా పిలుపులు
జగన్ పర్యటన నేపథ్యంలో భారీగా తరలి రావాలని వైసీపీ శ్రేణులకు హై కమాండ్ సూచించింది. అదే సమయంలో స్వామీజీలు, ధార్మిక సంఘాలు సైతం పెద్ద ఎత్తున తిరుమల చేరుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ ను అడ్డుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పోలీస్ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. మతపరమైన అంశం కావడంతో ప్రభుత్వం సైతం సీరియస్ చర్యలు చేపట్టే అవకాశం ఉంది. అవసరమైతే జగన్ ను అడ్డగించి, అడ్డుకోవాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.మరి ఏం జరుగుతుందో చూడాలి.