Andhra Pradesh: ఏపీలో గెలుపు ఎవరిది? ఏ ప్రాంతం ఏ పార్టీకి మద్దతు తెలిపింది? బలమైన చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలు కీలకంగా మారాయి. ఉత్తరాంధ్ర, మద్యాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలో రాజకీయ పరిస్థితులు ఉంటాయి. ఒక్కో ప్రాంతం ఒక్కో పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. రాయలసీమ వైసిపికి, మధ్యాంధ్ర టిడిపికి, ఉత్తరాంధ్ర హోరా హోరి అన్న పరిస్థితి ఉంటుంది. అయితే గత ఎన్నికల్లో ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అన్న తేడా లేదు. అన్ని ప్రాంతాల్లో వైసిపి ఏకపక్ష విజయం సాధించింది. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండదని తెలుస్తోంది. నిర్దిష్ట ప్రాంతం ఫలానా పార్టీకి వెన్ను దన్నుగా నిలుస్తుందని చెప్పడం కష్టతరంగా మారింది.
ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014లో టిడిపి కూటమికి 25 స్థానాలు దక్కాయి. వైసీపీ కేవలం 9 స్థానాలకి పరిమితం అయ్యింది. అదే 2019 ఎన్నికలకు వచ్చేసరికి వైసిపి 28 స్థానాలను దక్కించుకుంది. టిడిపి ఆరు స్థానాలతో సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం టఫ్ ఫైట్ ఉంటుందని తెలుస్తోంది. వైసీపీ కంటే కూటమికే కాస్త అనుకూలత కనిపిస్తోంది.
ఉభయగోదావరి జిల్లాలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉంది. ఉమ్మడి రాష్ట్రం నుండి ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. 2014లో గోదావరి జిల్లాల ప్రజలు టిడిపి కూటమి వైపు మొగ్గు చూపారు. 2019లో మాత్రం వైసీపీకి జై కొట్టారు. ఎన్నికల్లో మాత్రం పవన్ ఫ్యాక్టర్ పనిచేయడంతో కూటమి వైపే మొగ్గు చూపినట్లు సంకేతాలు వస్తున్నాయి.
దక్షిణ కోస్తా జిల్లాలు అయిన గుంటూరు, కృష్ణాలో మాత్రం తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది. 2014లో మెజారిటీ స్థానాలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంది. ఎన్నికల్లో కూడా స్పష్టమైన మెజారిటీ దిశగా కూటమికే ఛాన్స్ ఉంటుందని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రభావం అధికంగా ఉంటుందని.. అందుకే కూటమికి ఛాన్స్ ఉంటుందన్న విశ్లేషణలు వస్తున్నాయి.
వైసిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి గట్టి మద్దతుగా నిలిచాయి నెల్లూరు, ప్రకాశం. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసిపి స్వీప్ చేసింది. పదికి పది స్థానాలను గెలుచుకుంది. అటు ప్రకాశం జిల్లాలో సైతం మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా నెల్లూరులో టిడిపి పట్టు బిగించింది. అక్కడ సింహభాగం స్థానాలను టిడిపి దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో నాలుగు స్థానాలను టిడిపి దక్కించుకుంది. ఎన్నికల్లో ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకోనుందని ఒక విశ్లేషణ అయితే బలంగా నడుస్తోంది.
రాయలసీమలో అయితే భిన్న వాతావరణం ఉంది. వైసిపి ఆవిర్భావం తర్వాత రాయలసీమలో ఆ పార్టీదే ఆధిపత్యం. 2014 ఎన్నికల్లో ఒక్క అనంతపురం తప్పించి.. మిగతా మూడు జిల్లాల్లో వైసీపీయే హవా చాటింది. గత ఎన్నికల్లో అయితే 52 స్థానాలకు గాను మూడు చోట్ల మాత్రమే టిడిపి విజయం సాధించింది. కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ గెలిచారు. ఈసారి పాతిక సీట్లకు పైగా గెలుస్తామని తెలుగుదేశం పార్టీ ధీమాతో ఉంది. గతం మాదిరిగా సీట్లు వచ్చే ఛాన్స్ లేదని.. ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు జిల్లాలో టిడిపి సీట్లు పెరుగుతాయని అధికార పార్టీ నేతలు అంతర్గత చర్చలో ఒప్పుకుంటున్నారు. మొత్తానికి అయితే గత రెండు ఎన్నికలతో పోల్చుకుంటే.. ఈ ఎన్నికలు భిన్నంగా కనిపిస్తున్నాయి.