BJP: తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు కుదిరే పని కాదని విశ్లేషణలు వచ్చాయి. అసలు బిజెపి టిడిపి రూట్లోకి రాదని కూడా వైసిపి అనుకూల వర్గాలు చెప్పుకొచ్చాయి. ఒకవేళ పొత్తు కుదిరినా బిజెపిఎక్కువ సీట్లు కోరుతుందని.. పవర్ షేరింగ్ సైతం అడుగుతుందని.. తనకు కాకున్నా పవన్ అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుందని వైసిపి అనుకూల మీడియా విశ్లేషించింది. అసలు టిడిపిని కలుపుకెళ్లేందుకు బిజెపి అగ్ర నేతలు ఇష్టపడడం లేదని కూడా తేల్చి చెప్పింది. వైసీపీ అంటేనే బిజెపికి అపార గౌరవం అని.. టిడిపికి డోర్స్ క్లోజ్ అయినట్టేనని రకరకాల ప్రచారం జరిగింది. వీటన్నింటిని తెరదించుతూ బిజెపి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. పది అసెంబ్లీ సీట్లు, ఆరు పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వైసిపి మాట చెల్లుబాటు కాకుండా పోయింది.
ఇప్పటివరకు నేషనల్ మీడియా సంస్థలు ఏపీలో సర్వేలు చేశాయి. మెజారిటీ సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. కొన్ని సంస్థలు అయితే ఏకపక్షంగా వైసిపి గెలుపొందుతుందని తేల్చి చెప్పాయి. అయినా సరే బీజేపీ టిడిపి పొత్తుకు ఒప్పుకుందంటే సాహసం అనే చెప్పాలి. పైగా అన్ని విధాలా సహకారం అందించే జగన్ రూపంలో వైసిపి ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఏకపక్షంగా పార్లమెంట్ స్థానాలను గెలిచే ఛాన్స్ ఉంది. అయినా సరే బిజెపి పెద్దలు వైసీపీని పట్టించుకోకుండా టిడిపి తో పొత్తు పెట్టుకోవడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.సర్వే సంస్థలు తప్పుడు నివేదికలైనా ఇచ్చి ఉండాలి.లేకుంటేబిజెపి అగ్ర నేతలు సొంతంగా సర్వే చేయించి ఉండాలి.ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి ఉండాలి.ఒక జాతీయస్థాయిలో మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న బిజెపి.. గెలవాలనుకుంటున్న పార్టీతోనే కలుస్తుంది కానీ.. ఓడిపోయే పార్టీతో చేయి కలిపే ఛాన్స్ లేదు.
వాస్తవానికి ఏపీలో పరిస్థితులపై బీజేపీకి స్పష్టమైన అవగాహన ఉంది.బిజెపి అగ్రనేతలు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కొన్ని జాతీయ మీడియాలు చేసిన సర్వేలను వారు పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. కేంద్రానికి సైతం కొన్ని నిఘా సంస్థలు ఉంటాయి. వాటిపైన కేంద్రం ఆధారపడుతుంది.వాటి నివేదికల ఆధారంగానే కేంద్రం పొత్తులపై ఒక నిర్ణయం తీసుకుంటుందన్న అభిప్రాయం ఉంది.ఏపీలో విపక్షాలకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఈపాటికే నిఘా సంస్థలు హెచ్చరించి ఉండేవి కదా? కానీ బిజెపి విపక్షాలతో కలవడం ఏమిటి? తనకు అన్ని విధాలా సహకరిస్తున్న జగన్ ఉండగా.. గత ఎన్నికలకు ముందు దారుణంగా దెబ్బతీసిన చంద్రబాబును నమ్మడం ఏంటి? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఆ మూడు పార్టీల మధ్య పొత్తు సవ్యంగా ముందుకు సాగుతోంది. సీట్ల సర్దుబాటు సైతం ఒక కొలిక్కి వస్తోంది. మొత్తానికైతే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఏపీ విషయంలో తీసుకున్న నిర్ణయం సైతం హాట్ టాపిక్ గా మారుతోంది. ఏపీలో గెలుపోటములను పరిగణలోకి తీసుకునే బిజెపి నిర్ణయం తీసుకొని ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.