Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఎందుకు కామెంట్స్ చేశారు? ఆయన అసంతృప్తితో ఉన్నారా? లేకుంటే వేరే ఆలోచనతో ఉన్నారా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ ఇదే. మరోవైపు ఆయన వ్యూహాత్మకంగానే మాట్లాడాలని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఆలోచనతోనే ఆయన మాట్లాడి ఉంటారని ఒక అంచనా ఉంది. ఎందుకంటే మంత్రివర్గంలో ఉన్నవారు చురుగ్గా వ్యవహరించడం లేదన్న విమర్శ ఉంది. పైగా ఇటీవల ఏపీలో నేరాలు పెరిగాయి అన్నది వాస్తవం. నేర నియంత్రణలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని విపక్షం ఆరోపిస్తోంది. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్తే ఇబ్బందికర పరిణామాలు తప్పవు. అందుకే పవన్ వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పవన్ వ్యాఖ్యలు లోతుగా విశ్లేషిస్తే అసలు పాయింట్ అర్థమవుతుంది. పోలీసు యంత్రాంగం ఉదాసీనత ఇటువంటి ఘటనలకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో సీఎం చంద్రబాబును నిండు సభలో అవమానపరిచారని.. తన ఇంట్లో మహిళలను సైతం దూషించారని గుర్తు చేశారు పవన్. అలా దూషించినది వైసిపి నేతలతో పాటు వారు ప్రోత్సహించిన వ్యక్తులు. అందుకే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు పవన్. ఫలానా నిందితుడు మా కులం వాడు, మా బంధువు అంటూ కొంతమంది అధికారులు, నేతలు అనుకోవడం వల్లే ఇటువంటి ఘటనలు పెరుగుతున్నాయి అన్నది పవన్ అభిప్రాయం. అయితే నేనే హోంమంత్రి పదవి తీసుకుంటే ఇంకోలా ఉంటుందని పవన్ వ్యాఖ్యానించారు.అందుకే రివ్యూలు జరపాలని హోంమంత్రి వంగలపూడి అనితకు సూచించారు. అయితే అప్పటినుంచి వైసిపి దుష్ప్రచారం ప్రారంభించింది. అంబటి రాంబాబు అయితే ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. కిల్ మిల్ పాండే అవుతారో? ఇంకొకరిగా మారుతారో అంటూ ఎద్దేవా చేయడం ప్రారంభించారు. కూటమిలో విభేదాలు అంటూ పతాక స్థాయిలో వైసీపీ అనుకూల మీడియా కథనాలు అల్లుతోంది.
* ఎప్పుడూ వ్యూహమే
అయితే గత ఐదేళ్లుగా పరిణామాలు పరిశీలిస్తే పవన్ కామెంట్స్ వెనుక బలమైన వ్యూహం ఉంటుంది. అది కచ్చితంగా చంద్రబాబు సూచనతోనే ఉంటుందన్న విషయాన్ని గ్రహించుకోవాలి. వాస్తవానికి హోం శాఖ మంత్రి అనితకు గతంలోనే చంద్రబాబు ఒకసారి హెచ్చరిక పంపారు. ఇప్పుడు అదే హెచ్చరిక పవన్ కళ్యాణ్ నుంచి వచ్చేసరికి కూటమిలో విభేదాలు అంటూ వైసీపీ సంబరపడుతోంది. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం సుస్థిరతకు ఎటువంటి డోకా లేదన్న విషయాన్ని గ్రహించుకోవాలి. ఆ మూడు పార్టీల అధినేతలు ఒకే అభిప్రాయంతో ఉన్నారు. పైగా చంద్రబాబుపై పూర్తి విశ్వాసం ప్రకటిస్తున్నారు. కానీ ఇప్పుడు పవన్ అలా వ్యాఖ్యలు చేసేసరికి చంద్రబాబుతో విభేదించారు అంటూ వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. టార్గెట్ అనిత కాదు చంద్రబాబు అంటూ లేనిపోని కథలు అల్లుతోంది.
* డైవర్షన్ తప్పదు
డైవర్షన్ పాలిటిక్స్ అంటూ వైసీపీ తరచు చంద్రబాబుపై ఆరోపిస్తోంది. అయితే అది ముమ్మాటికి నిజమే. ప్రభుత్వ మనుగడకు అవసరం కూడా. పైగా వైసీపీ ఏ స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారానికి దిగుతుందో తెలియంది కాదు. అందుకే చంద్రబాబుతో పాటు పవన్ ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ తరచు ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు అదే మాట పవన్ నోటి నుంచి రావడంతో తెగ సంబర పడిపోతోంది. కూటమిలో విభేదాలు వచ్చాయంటూ ఆనందపడుతోంది. కానీ పవన్ వ్యాఖ్యల వెనుక వ్యూహం ఉందని.. అది రానున్న రోజుల్లో తెలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.