Chandrababu: టిడిపి కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా 135 స్థానాల్లో విజయం సాధించింది. పోటీ చేసిన 21చోట్ల జనసేన గెలుపొందింది. 8 చోట్ల బిజెపి విజయం సాధించింది. అయితే ఈ సక్సెస్ వెనుక చంద్రబాబుతో పాటు పవన్ ఉన్నారు. చంద్రబాబు ఈనెల 9న ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. అయితే పవన్ పాత్ర ఏమిటి అన్నది తెలియడం లేదు. ఆయనకు మంత్రి పదవి ఇస్తారా? డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తారా? అన్న చర్చ నడుస్తోంది. మరోవైపు లోకేష్ పాత్ర గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. ఈ ఇద్దరు నేతలు ఎలా వ్యవహరిస్తారు అన్నది తెలియాలి.
పవన్ ఈసారి మంత్రివర్గంలో చేరకపోవచ్చు అన్నది ఒక అంచనా. ఒక పార్టీ అధినేతగా ఉంటూ.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వెనుక కీలకంగా వ్యవహరిస్తారని మాత్రం తెలుస్తోంది. కూటమిపరంగా ప్రజలకు హామీలు ఇచ్చినందున.. వాటి అమలు.. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు పవన్ సేవలను వినియోగించుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేనకు మూడు మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. కొణతాల రామకృష్ణ, నాదెండ్ల మనోహర్, బొలిశెట్టి సత్యనారాయణ లకు తప్పకుండా మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతోంది. బీసీ కోటాలో ఉత్తరాంధ్రకు చెందిన కొణతాల రామకృష్ణకు మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం హోదాను కట్టబెడతారని కూడా టాక్ నడుస్తోంది.
నారా లోకేష్ సైతం మంత్రి పదవి తీసుకోకపోవచ్చు అన్నది ఒక అంచనా. ప్రభుత్వంలో తన పాత్ర ఏమిటో చంద్రబాబు చెబుతారని లోకేష్ ప్రకటించారు. 2014 ఎన్నికల్లో లోకేష్ పోటీ చేయలేదు. ఎమ్మెల్సీ ని చేసి ఆపై మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. అప్పట్లో పాలనా వ్యవహారాలపై చంద్రబాబు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. పార్టీని విడిచి పెట్టినట్లు ప్రచారం జరిగింది. పార్టీలో వ్యతిరేకతకు ఇది ఒక కారణంగా మారింది. ప్రస్తుతం సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో.. పార్టీ వ్యవహారాలను లోకేష్ చూసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. పార్టీ శ్రేణులకు ప్రభుత్వానికి మధ్య లోకేష్ సమన్వయం చేస్తారని.. అందుకే మంత్రివర్గంలో చేరారని ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.