Mudragada Padmanabham : ముద్రగడ రాజకీయాల నుంచి తప్పుకున్నారా? వైసీపీకి దూరంగా జరుగుతున్నారా? ఆ పార్టీతో ఉంటే లాభం లేదని భావిస్తున్నారా? ఏరికోరి ఇబ్బందులు ఎందుకులే అనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వరద బాధితుల పరామర్శలో భాగంగా జగన్ పిఠాపురంలో పర్యటించారు. ట్రాక్టర్లో వెళ్లి మరి బాధితులను పరామర్శించారు. ఆయన వెంట వంగా గీత ఉన్నారు. కురసాల కన్నబాబు ఉన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సైతం అనుసరించారు. ముద్రగడ మాత్రం కనిపించలేదు. జగన్ సైతం ముద్రగడ ఇంటి వరకు వెళ్లినా.. ఆయన నివాసం వైపు చూడలేదు. దీంతో ముద్రగడ వైసీపీతో కటీఫ్ చెప్పారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నాలుగు నెలల కిందట ఎన్నికల ప్రచారంలో జగన్ వెంట ముద్రగడ కనిపించారు. పిఠాపురంలో అన్ని తానై వ్యవహరించారు. వైసిపి అభ్యర్థి వంగా గీత గెలుపు తన భుజస్కందాలపై వేసుకున్నారు. కానీ ఇప్పుడు కనిపించకుండా ఉండడంతో ముద్రగడ కీలక నిర్ణయం తీసుకున్నారా? అన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి.
* వైసిపి ఓటమితో షాక్
వైసీపీ ఓటమి తర్వాత ముద్రగడ పెద్దగా కనిపించలేదు. ఒకటి రెండుసార్లు తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్లి జగన్ ను కలిశారు. పవన్ గెలిస్తే పద్మనాభ రెడ్డి గా పేరు మార్చుకుంటానని చెప్పిన ఆయన.. మాటమీద నిలబడ్డారు. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. పేరు మార్చుకున్నారు. ఈ ఐదేళ్ల పాటు జగన్ వెంట ఉంటానని తేల్చి చెప్పారు. సీన్ కట్ చేస్తే తరువాత ఆయన ఆచూకీ లేకుండా పోయింది. అనవసరంగా ఈ ఐదేళ్లపాటు ఇబ్బందులు పడడం ఎందుకని ముద్రగడ వైసీపీకి దూరం జరుగుతున్నట్లు తెలుస్తోంది.వైసిపి వర్గాల్లో సైతం అదే ప్రచారం నడుస్తోంది.
* అప్పట్లో పదవి ఆఫర్
వైసిపి గెలిస్తే ముద్రగడకు రాజ్యసభ పదవిని జగన్ ఆఫర్ చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఒక్క రాజ్యసభ సీటైనా, ఎమ్మెల్సీ స్థానాన్ని అయినా గెలుచుకునే అవకాశం లేదు. అందుకే వైసీపీని నమ్ముకుంటే తనకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని తెలిసి.. ముద్రగడ సైలెంట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు ముద్రగడ. నిర్ణయాలు తీసుకోవడంలో తప్పిదాలు ఆయనకు శాపంగా మారాయి.
* ఐదేళ్ల పాటు ఇబ్బందులు తప్పవనే
ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో జనసేన హవా నడుస్తోంది.ఇటువంటి సమయంలో వైసీపీలో యాక్టివ్ అయితే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని ముద్రగడ భావిస్తున్నారు.మరోవైపు వైసీపీలో ఉంటేతమకు భవిష్యత్తు ఉండదని భావిస్తున్న కాపు నేతలు జనసేన బాట పడుతున్నారు. అందుకే ముద్రగడ సైతం పునరాలోచనలో పడ్డారు. ఇప్పటికే వైసీపీలోకి వెళ్లి.. భారీ శపధాలు చేయడంతో ఆయన పెద్దరికానికి భారీ డ్యామేజ్ జరిగింది. అందుకే రాజకీయాలకు దూరం కావాలని ముద్రగడ భావిస్తున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. మరి ముద్రగడ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More