Jagan Vs Sharmila
Jagan Vs Sharmila: కొంతకాలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్ షర్మిల ఉప్పు నిప్పులాగా వ్యవహరిస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పార్టీని కాపాడేందుకు షర్మిల పాదయాత్ర చేశారు. అన్న విడిచిన బాణం అంటూ ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చారు. కొంతకాలానికి పరిస్థితులు మారిపోయాయి. షర్మిలకు తన అన్న అసలు రంగు తెలిసింది. దీంతో తెలంగాణలో వేరు కుంపటి పెట్టింది. కొంతకాలానికి ఆమె ఏర్పాటుచేసిన పార్టీ కాంగ్రెస్ లో విలీనమైంది. ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియమితురాలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బోణి చేయలేకపోయినప్పటికీ.. జగన్ ఓటమిలో తను కూడా ఒక చేయి వేసింది. ఇప్పుడు తాజాగా వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు నెలకొన్నాయి. జగన్మోహన్ రెడ్డి తన తల్లికి, సోదరికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయడం సంచలనంగా మారింది.
తల్లికి లీగల్ నోటీస్
తన కంపెనీకి సంబంధించిన షేర్లు తనకు తెలియకుండా బట్వాడా చేయించుకున్నారని తన తల్లి విజయమ్మకు జగన్మోహన్ రెడ్డి లీగల్ నోటీసు ఇచ్చారు. అదే సమయంలో ఆస్తుల పంపకానికి సంబంధించి అగ్రిమెంట్ రద్దు చేసుకుందామంటూ షర్మిలకు జగన్ లేఖ రాశారు. దీనిపై షర్మిల కూడా అదే స్థాయిలో స్పందించారు. ఈ లేఖ వెనుక ఉన్న అసలు కారణం సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ. ఈ కంపెనీలో జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మకు ఒక శాతం వాటాను గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చారు. అయితే అందులోని షేర్లను విజయమ్మ షర్మిలకు బదలాయించారు. అయితే వీటిని తనకు తెలియకుండా షర్మిలకు విజయమ్మ బదిలీ చేయడాన్ని జగన్ ప్రశ్నిస్తున్నారు. దీనిని రద్దు చేయాలని నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్ ను జగన్మోహన్ రెడ్డి ఆశ్రయించారు. సరస్వతి పవర్ కంపెనీలో జగన్మోహన్ రెడ్డికి 99 శాతం షేర్లు ఉన్నాయి. ఒక శాతం షేర్లు విజయమ్మకు ఉన్నాయి. అయితే అక్రమస్తుల కేసుల్లో భాగంగా సిబిఐ, ఈడి సరస్వతి పవర్ కంపెనీని అటాచ్ చేసింది. దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది.
49 శాతం ఇస్తానని చెప్పారట
షర్మిలకు గతంలో జగన్మోహన్ రెడ్డి సరస్వతి సిమెంట్స్ కంపెనీలో 49 శాతం షేర్లు ఇస్తానని చెప్పారట. అయితే ఇలా షేర్లను షర్మిలకు నేరుగా బదులు చేయడం చట్ట విరుద్ధం. అందువల్ల అప్పటికే ఒక శాతం వాటాదారుగా ఉన్న విజయమ్మకు ఈ షేర్లను గిఫ్ట్ డీడ్ గా రాసి ఇచ్చారు. కేసులు పూర్తయిన తర్వాత ఈ షేర్లను షర్మిల పేరు మీదకు బదిలీ చేయించుకోవచ్చని 2019లోనే జగన్ ఆ గిఫ్ట్ డీడ్ రాసి ఇచ్చారు. అయితే సరస్వతి కంపెనీకి చెందిన ఆస్తులు అటాచ్మెంట్ లో ఉన్నాయి. వాటిని అమ్మడానికి గాని.. కొనుగోలు చేయడానికి గాని లేదు. అయితే జగన్ 2019లో ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ను ఆధారంగా చేసుకుని షర్మిల తన తల్లి విజయమ్మ దగ్గర నుంచి షేర్లను తన పేరు మీదకు బదులు చేయించుకున్నారు. అయితే కోర్టులో స్టేటస్ కో ఉత్తర్వులున్న నేపథ్యంలో ఈ పరిణామం న్యాయపరంగా తలనొప్పులకు కారణమవుతుందని న్యాయవాదులు జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి న్యాయవాదుల హెచ్చరికలతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు.