Anna canteens : పేదలకు పట్టెడన్నం కోసం కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది.ఉదయం టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు..రూ.15లకే పేదల కడుపు నింపుతోంది. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 100 క్యాంటీన్లను ప్రారంభించింది. ఈ నెలాఖరుకు మరో 103 క్యాంటీన్లను తెరిపించేందుకు కసరత్తు చేస్తోంది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు అన్న క్యాంటీన్ లను ప్రారంభించారు. నగరాలతో పాటు పట్టణాల్లో క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చారు. ఐదు రూపాయలకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందించగలిగారు. నగరాల్లో ఉండే చిరు వ్యాపారులు, నిరుద్యోగులు, పేదలు, వివిధ అవసరాలపై నగరాలకు వచ్చేవారు ఇక్కడ కడుపు నింపుకునేవారు. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను నిలిపివేసింది. తాము అధికారంలోకి వస్తే క్యాంటీన్లను తెరిపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా క్యాంటీన్లను తెరిచారు. హరే రామకృష్ణ మూమెంట్ కు చెందిన అక్షయపాత్ర ఫౌండేషన్ కు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. టిఫిన్ తో పాటు భోజనం మెనూ ప్రకటించారు. ఆహార పరిమాణాన్ని సైతం నిర్దేశించారు. అయితే ఈ అన్న క్యాంటీన్లతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. అయినా సరే సక్సెస్ ఫుల్ గా నడిపించేందుకు అవసరమైన వ్యూహాన్ని చంద్రబాబు సర్కార్ సిద్ధం చేసింది. అన్న క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుంచి విరాళాల సేకరణ సైతం చేపడుతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్న క్యాంటీన్ల నిర్వహణకు రెండు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. మరికొందరు దాతలు ముందుకు వచ్చి సాయం ప్రకటిస్తున్నారు.
* భారం పెరిగినా
అయితే అన్న క్యాంటీన్లకు భారీగా ఖర్చు అవుతోంది. అయినా సరే ఇంకా అదనంగా క్యాంటీన్లను తెరిచి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్న క్యాంటీన్ లకు రోజువారి అవుతున్న ఖర్చు అక్షరాల రూ. 78.75 లక్షలు.నెలకు రూ. 19.68 కోట్లు. ఏడాదికి రూ. 236.25 కోట్లు.వచ్చేనెల అదనంగా మరో 103 క్యాంటీన్లు తెరవనున్నాయి. వీటిని కలుపుకుంటే మొత్తం 203 క్యాంటీన్లు అవుతాయి.దీంతో నెలకు రూ.39.96 కోట్లు ఖర్చు కానుంది.ఏడాదికి రూ. 479 కోట్ల ఖర్చు కానున్నట్లు తేలింది.
* పెరిగిన సబ్సిడీ
ఆహార పదార్థాలపై సబ్సిడీ భారం మరింత పెరిగింది. అప్పట్లో ఒక్కో ప్లేట్ టిఫిన్ పై సబ్సిడీ భారం 13 రూపాయలు ఉండగా.. అది ఇప్పుడు 17 కు చేరింది. ప్లేట్ భోజనం పై సబ్సిడీ అప్పట్లో రూ. 22.50 ఉండగా.. ఇప్పుడు అది 29 రూపాయలకు చేరింది.ఈ లెక్కన ఒక వ్యక్తిమూడు పూటలా భోజనానికి అప్పట్లో 50 ఎనిమిది రూపాయలు సబ్సిడీ ఇస్తే.. ఇప్పుడది 75 రూపాయలకు చేరుకుంది.ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం పై అదనపు భారం పడినట్టే.
* దాతల సహకారంతో
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న అన్న క్యాంటీన్లను పగడ్బందీగా చేపట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకూడదని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది.అవసరమైతే దాతల సాయంతో ముందుకెళ్లాలని చూస్తోంది. అదే సమయంలో ఆహార పదార్థాల నాణ్యత పై రాజీ లేకుండా ఉండాలనుకుంటుంది. ఐదేళ్ల పాటు నిరాటంకంగా క్యాంటీన్లను కొనసాగించాలని భావిస్తోంది చంద్రబాబు సర్కార్.