Vinesh Phoghat: వినేశ్ ఫొగాట్ ఇండియాకు రావడమే ఆలస్యం.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె భర్త..

ఇటీవల వినేశ్ ఫొగాట్ పారిస్ ఒలంపిక్స్ లో రెజ్లింగ్ ఫైనల్ పోటీలో 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉందని తిరస్కరణకు గురైంది. దీని వెనుక కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారని విపక్షాలు ఆరోపించాయి. పార్లమెంట్లో పెద్ద ఎత్తున దుమారాన్ని సృష్టించాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : August 17, 2024 6:49 pm

Vinesh Phoghat

Follow us on

Vinesh phoghat: వినేశ్ ఫొగాట్ కు కాస్ లో చుక్కెదురైంది. కనీసం రజతమైన దక్కించుకోవాలనుకున్న ఆమె ఆశ ఆడియాసయింది. దీంతో కన్నీటితోనే స్వదేశానికి చేరుకుంది. శనివారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో ఆమె దిగగానే అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూనే ఆమె అభిమానులకు అభివాదం చేసింది. అభిమానులు భారీగా వెంట రాగా తన స్వగృహానికి చేరుకుంది. ఈ క్రమంలో వినేశ్ ఫొగాట్ భర్త సోమ్ వీర్ రాథీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. జాతీయ మీడియా ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇవ్వడంతో మంటలు చెలరేగుతున్నాయి. అయితే ఇవి క్రమేపి రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇటీవల వినేశ్ ఫొగాట్ పారిస్ ఒలంపిక్స్ లో రెజ్లింగ్ ఫైనల్ పోటీలో 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉందని తిరస్కరణకు గురైంది. దీని వెనుక కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారని విపక్షాలు ఆరోపించాయి. పార్లమెంట్లో పెద్ద ఎత్తున దుమారాన్ని సృష్టించాయి. ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్ నుంచి వాకౌట్ చేశారు. అది సద్దుమణిగిన తర్వాత మళ్లీ ఇప్పుడు వినేశ్ ఫొగాట్ భర్త సోమ్ వీర్ కీలక వ్యాఖ్యలు చేయడం రచ్చకు కారణమవుతోంది. “కష్టకాలంలో వినేశ్ ఫొగాట్ వైపు దేశం నిలబడింది. ఆమెకు అండగా నిలిచింది. ఆమె ఫైనల్ లో అనర్హతకు గురి కావడంతో దిగ్బ్రాంతికి గురైంది. సహచర మల్ల యోధులు ఆమెకు బాసటగా నిలిచారు. వాస్తవానికి ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమవుతుందని మేము కలలు కూడా ఊహించలేదు. ఇలాంటి సందర్భంలో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. మెడల్ వెంట్రుకవాసిలో మాకు దూరమైంది. కాస్ తీర్పు మాకు అనుకూలంగా రాలేదు. ఇలాంటి సందర్భంలో రెజ్లింగ్ ఫెడరేషన్ మాకు సపోర్ట్ ఇవ్వలేదు. ఆటగాళ్లకు ఫెడరేషన్ భరోసా లభించినప్పుడు వారు ఎలా మెరుగైన ప్రదర్శన చేస్తారని” సోమ్ వీర్ ప్రశ్నించాడు.

ఆమెతో మేము మాట్లాడతాం

వినేశ్ ఫొగాట్ మాతృదేశానికి చేరుకున్న నేపథ్యంలో.. ఇటీవల ఆమె ప్రకటించిన రిటైర్మెంట్ పై తమ మాట్లాడతామని ఆమె సోదరుడు హరివిందర్ పేర్కొన్నాడు. ” విశ్రాంతి లేని ప్రయాణం తర్వాత ఆమె మాతృభూమికి చేరుకుంది. తప్పకుండా ఆమెతో ఈ విషయం గురించి మేము చర్చిస్తాం. మెడల్ స్వల్ప తేడాతో చేజారిపోయింది. ఈ బాధను తట్టుకోవడం మాకు చాలా కష్టంగా ఉంది. ఈ సమయంలో కుటుంబం మొత్తం ఆమెకు భరోసాగా ఉంటుంది. ఆమె రెజ్లింగ్ లో కొనసాగాలనేది మా అభిమానం. తప్పకుండా ఆమె నుంచి ఒలింపిక్ మెడల్ దేశానికి వస్తుందని” హరివిందర్ పేర్కొన్నాడు. గతంలో ఇదే విషయాన్ని ఆమె పెదనాన్న మహావీర్ కూడా వెల్లడించాడు. అవసరమైతే తానే ఆమెకు శిక్షణ ఇచ్చి.. ఒలింపిక్స్ కు సన్నద్ధం చేస్తానని అప్పట్లో వ్యాఖ్యానించాడు. ఆమె తన రిటైర్మెంట్ పై పునరాలోచన చేయాలని పేర్కొన్నాడు. ఒలింపిక్ మెడల్ సాధించాలని సూచించాడు.