Homeఆంధ్రప్రదేశ్‌Balakrishna: హిందూపురంలో బాలకృష్ణ పరిస్థితి ఏంటి?

Balakrishna: హిందూపురంలో బాలకృష్ణ పరిస్థితి ఏంటి?

Balakrishna: రాష్ట్రంలో కీలక నియోజకవర్గాల్లో హిందూపురం ఒకటి. ఇక్కడ నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో ఆయనే గెలిచారు. ఎన్నికల్లో మాత్రం బాలకృష్ణ గెలవకూడదని జగన్ భావిస్తున్నారు. అందుకే ఎలాగైనా ఓడించాలని కృత నిశ్చయంతో ఉన్నారు. అయితే వైసీపీకి పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదు. బాలకృష్ణ ఓడించాలన్న కసితో తీసుకున్న నిర్ణయాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. మొదటికే మోసం చేస్తున్నాయి.వాస్తవానికి హిందూపురంలో తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో బలం అధికం. పార్టీ ఆవిర్భావం నుంచి ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఒకవేళ పార్టీపై వ్యతిరేకత ఉన్నా.. ప్రత్యర్ధులు రెబెల్స్ గా మారి టిడిపిని గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మరోసారి అటువంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది.

గతంలో నందమూరి తారక రామారావు తో పాటు నందమూరి హరికృష్ణ హిందూపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. దీంతో 2014 ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం తెర పైకి వచ్చారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి నవీన్ నిశ్చల్ పై 16,196 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం బాలకృష్ణ విజయం సాధించారు. 2014 కంటే మెజారిటీ పెంచుకున్నారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మహమ్మద్ ఇక్బాల్ పై 17028 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి కూడా రికార్డు మెజారిటీతో గెలవాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు బాలకృష్ణ.

వైసీపీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక నాయకులు విఫలమయ్యారు. హిందూపురంలో బాలకృష్ణను ఓడించే బాధ్యతను జగన్ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఆయన తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు కంటే.. హిందూపురం పైనే ఫోకస్ పెట్టారు. ఎక్కువకాలం ఇక్కడే గడిపారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. మరోసారి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ సడన్ గా ఇతర నియోజకవర్గానికి చెందిన దీపికా రెడ్డి అనే మహిళ నేతను తెరపైకి తెచ్చారు. ఆమెకు టికెట్ ప్రకటించారు. దీంతో ఇక్బాల్ మనస్థాపానికి గురయ్యారు. పార్టీ సభ్యత్వం తో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. నవీన్ నిశ్చల్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనితో పాటు మరికొందరు నేతలు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. ఇలానే రాజకీయం కొనసాగితే మాత్రం బాలకృష్ణ మెజారిటీ పెరగడం ఖాయంగా తేలుతోంది.

హిందూపురంలో గత ఐదేళ్లుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. పైగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంట్రీ తర్వాత చాలా రకాలుగా సమీకరణలు మారాయి. పెద్ద ఎత్తున టిడిపి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కొత్త, పాత క్యాడర్ మధ్య సమన్వయం లేదు. వైసీపీలో బహు నాయకత్వం పెరిగింది. నేతలందరికీ నామినేటెడ్ పదవులు ఇచ్చి రెక్కలు ఇచ్చారు. కానీ వారిలో ఎవరికీ టిక్కెట్లు ఇవ్వకుండా.. హిందూపురం తో సంబంధం లేని మహిళా నేతకు టికెట్ కట్టబెట్టారు. దీంతో మిగతా నేతలు నొచ్చుకున్నారు. బాలకృష్ణను ఓడించాలన్న కసి పక్కకు వెళ్ళిపోయింది. అదే వైసీపీకి శాపంగా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular