Pawan Varahi Yatra : వారాహితో కలిసొచ్చేదేంటి?

అయితే ఇప్పుడు సీట్ల సర్దుబాటే రెండు పార్టీలకు ఎదురుగా ఉన్న అసలు సిసలైన యాగం. మరి ఎలా ముందుకెళతారో అన్నది రెండు పార్టీల నాయకత్వంపై ఆధారపడి ఉంది.

Written By: Dharma, Updated On : June 9, 2023 12:37 pm
Follow us on

Pawan Varahi Yatra : ఇప్పుడు అందరి చూపు వారాహి యాత్రపైనే ఉంది. ఈ నెల 14 నుంచి పవన్ వారాహి యాత్ర ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే అన్నవరంలో పూజలు అనంతరం పవన్ వారాహి వాహనంపై ఎక్కనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తొలి విడత యాత్ర చేపట్టనున్నారు. అయితే ఈ యాత్రపై అనేక అంచనాలు ఉన్నాయి. జగన్ సర్కారుపై పవన్ యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో ఎన్నో సంచలనాలు నమోదు కానున్నాయి. వైసీపీ నేతలపై పవన్ పవర్ ఫుల్ పంచులు కొనసాగనున్నాయి. ఇప్పటికే వారాహి యాత్రపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వారికి జన సైనికులు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. డైపర్లు కట్టుకోవాలని సలహా ఇస్తున్నారు.

పవన్ యాత్రకు జన సునామీ రానుంది. జనసేనకు అత్యంత బలమైన ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ యాత్ర సాగనుండడంతో అంచనాలకు మించి జనాలు రానున్నారు. రోడ్లపై బారులుదీరి మరీ పవన్ కోసం వేచి చూడనున్నారు. అసలు యాత్రకు జన సమస్యే ఉండదు. కానీ ఇక్కడే జనసేన వ్యూహాత్మకంగా అడుగులు వేయనుంది. పవన్ కోసం వచ్చే జనాలను చూపి పొత్తుల్లో సీట్లు ఎక్కువగా డిమాండ్ చేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక విధంగా పవన్ ప్రత్యర్థులపై పంజా విసరడంతో పాటు మిత్రపక్షం టీడీపికి సరికొత్త సంకేతాలు పంపించే చాన్స్ ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

పవన్ యాత్రకు ముందే టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఉభయతారకంగా ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అది జరిగితే రెండు పార్టీల మధ్య మరింత సానుకూలంగా మారుతుందని.. యాత్రలో జనసేన, టీడీపీ జెండాలు కలిపి కనిపించే అవకాశముంది. అయితే జనసేన మాత్రం యాత్రకు ముందు పొత్తులు ఎంతమాత్రం సహేతుకం కాదని భావిస్తోంది. అదే జరిగితే పరిమిత సీట్లు మాత్రమే టీడీపీ ఇవ్వజూపుతుందని.. అదే యాత్ర జరిగి.. జనసునామీ తరువాత సీట్లు పెంచుకునే చాన్స్ ఉంటుందని చెబుతోంది. మొత్తానికైతే యాత్ర జనసేన గ్రాఫ్ ను పెంచుతుందని ఆ పార్టీ భావిస్తోంది.

చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో ముందుగానే మేల్కొన్నారు. క్షేత్రస్థాయిలో తమ పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంలో సక్సెస్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతానని పవన్ శపధం చేశారో.. అప్పటి నుంచే పొత్తుల అంశం తెరపైకి వచ్చింది. దానిని ముందుకు తీసుకెళ్లడంలోనూ పవన్ కళ్యాణ్ దే ప్రధాన పాత్ర. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని హెచ్చరించడం టీడీపీలో జవసత్వాలు నింపింది. జన సైనికుల్లో కసి పెరిగింది. అయితే ఇప్పుడు సీట్ల సర్దుబాటే రెండు పార్టీలకు ఎదురుగా ఉన్న అసలు సిసలైన యాగం. మరి ఎలా ముందుకెళతారో అన్నది రెండు పార్టీల నాయకత్వంపై ఆధారపడి ఉంది.