Chandrababu: చంద్రబాబు అపర చాణుక్యుడు. గెలుపు కోసం చివరి వరకు పోరాడే లక్ష్యం ఉన్న నేత. గత ఐదు సంవత్సరాలుగా ఎన్నెన్నో అవమానాలు పడ్డారు. నిండు సభలోనే ఎన్నో విధాలుగా ఆయనను అగౌరవపరిచిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే సహనంతో వ్యవహరించారు. సంయమనంతో ముందుకు సాగారు. లైన్ తప్పకుండా ప్రవర్తించారు. అయితే ఆయన రాజకీయ వ్యూహాలు కూడా జెట్ స్పీడ్ లో ఉంటాయి. అవే ఈసారి గెలుపు నకు కారణమయ్యాయి. బిజెపిని పొత్తుకు ఒప్పించారు. సీట్ల సర్దుబాటు సవ్యంగా పూర్తి చేసుకున్నారు. మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపునకు సంబంధించి శరవేగంగా చర్యలు చేపట్టారు. బిజెపి పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. ఈసీ నుంచి అనుకూల నిర్ణయాలు వచ్చేలా చేసుకున్నారు. ఇలా అన్ని అంశాలు చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు దాహదపడ్డాయి.
అయితే చంద్రబాబుకు ఒక అరుదైన అవకాశం లభించింది. ఎన్డీఏ లో రెండో అతిపెద్ద పార్టీగా టిడిపి అవతరించింది. పొత్తులో భాగంగా 17 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తే.. 16 చోట్ల ఆ పార్టీ విజయం సాధించింది. ఒక్క కడపలో మాత్రమే ఓడిపోయింది. అటు జాతీయస్థాయిలో ఎన్డీఏ పరంగా మోడీ మ్యాజిక్ ఫిగర్ కు దాటారు. బిజెపి పరంగా మాత్రం వెనుకబడ్డారు. దీంతో మిత్రుల సాయం తప్పనిసరి. మరియు ముఖ్యంగా చంద్రబాబు పాత్ర కీలకం. అందుకే చంద్రబాబు గెలిచిన మరుక్షణం ప్రధాని మోదీ నుంచి ఫోన్ వచ్చింది. ఇండియా కూటమికి చెందిన సీతారాం ఏచూరి, శరద్ పవర్.. ఇలా జాతీయ నేతలంతా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.అయితే ఈ శుభాకాంక్షలు వెనుక తన అవసరం అన్నది ఉందని చంద్రబాబు గ్రహించగలిగారు. అందుకే శరవేగంగా తన మెదడుకు పదును పెడతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఎన్డీఏ నుంచి గతంలో దూరమైనప్పుడు ఏ తరహా ఇబ్బందులు ఎదురయ్యాయో చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే ఆచితూచి ఈసారి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే జాతీయస్థాయిలో జరిగే రాజకీయ పరిణామాలను అనుసరించి చంద్రబాబు అడుగులు ఉండనున్నాయి. ఇప్పుడు ఆయన కీలకంగా కూడా మారారు. ఎన్డీఏ సుస్థిర పాలన కొనసాగించాలన్నా.. ఇండియా కూటమి బలపడాలన్నా.. చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు సైతం ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇన్నాళ్లు చంద్రబాబు విషయంలో బిజెపి నిర్లక్ష్యంగా వ్యవహరించడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు అదే చంద్రబాబు లేనిదే తమకు ఇబ్బంది అని బిజెపి భావిస్తోంది. ఇలా ఎలా చూసుకున్నా చంద్రబాబు అవసరం జాతీయస్థాయిలో అన్ని పార్టీలకు ఉంది. అందుకే చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఎలా వేయబోతున్నారు అన్నది కీలకంగా మారింది.